తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలు నమోదు కాగా, అనేక జిల్లాల్లో 20-25 డిగ్రీల మధ్య నమోదైంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.