గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ఎల్లారెడ్డి జీవదాన్ హైస్కూల్ లో మూడు రోజుల పాటు నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడలు జరిగాయి. గురువారం శివ్వనగర్ లో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, దీనివల్ల శారీరక, మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. విజేతలకు బహుమతులు, సీఎం కప్ అందజేశారు.