స్థానిక దేశరాజపల్లెలోని ఒక ప్రైవేటు వేడుక మందిరంలో అట్టహాసంగా జరిగిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల "రివయాత్" కార్యక్రమ ప్రారంభోత్సవానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించి, వారికి ఎంతగానో ఉపకరిస్తాయని ఉద్ఘాటించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం తప్పనిసరని తెలిపారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని వాటిలో పాల్గొనేందుకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే కాకుండా దేశ కళల ఔన్నత్యాన్ని ఇతరులకు చాటి చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యా ప్రణాళికలో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకత ఇవ్వడం వల్ల విద్యార్థులకు చదువుకునేందుకు ఆసక్తి పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు ఆహూతులను ఆలోచింపజేశాయి. ఇటీవల ఐఐటీ, నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించిన (మరియు సాధించబోయే) అల్ఫోర్స్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.