TG: దసరా పండుగ సందర్భంగా శనివారం హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్ల కబేళా వద్ద మాంసం కొనుగోలుదారుల రద్దీ తీవ్రంగా పెరిగింది. నగరంలో మటన్ ధర కిలోకు రూ. 800 నుంచి రూ. 1,000 వరకు ఉండగా.. ఇక్కడ రూ. 500 నుంచి రూ. 700 మధ్య లభిస్తుండటంతో జనం పోటెత్తారు. దీంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. తక్కువ ధరకే మాంసం లభించడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేశారు.