మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం అందుగులపేట్ శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి ధ్రువీకరణ లేబుళ్లు, బిల్లులు లేని 100 కిలోల లూజ్ పత్తి విత్తనాలు లభించాయి. దీంతో వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.