విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంపొందించాలనే లక్ష్యంతో నిజాంపేట మండలంలోని నిజాంపేట, చల్మెడ, నగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా గ్రామాల సర్పంచులు చల్మేటి నరేందర్, మల్లేశం, సుశీల పథకాన్ని ప్రారంభించారు. తొలిరోజు విద్యార్థులకు మిల్లెట్ ఇడ్లీ, సాంబారును అల్పాహారంగా అందించారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చదువుపై ఆసక్తిని పెంపొందించవచ్చని భావిస్తున్నారు.