గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా, తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు జక్రాన్పల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో, కలెక్టర్ సోమవారం మోపాల్ మండలం కులాస్ పూర్, జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ చేపట్టాలని, చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది, మూడు రోజుల పాటు కొనసాగుతుంది.