పెద్దపల్లి జిల్లా మంథనిలోని గంగాపురి గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మంథని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక బోనును మంగళవారం ఏర్పాటు చేశారు. కోతులను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు 4వ వార్డు కౌన్సిలర్ ఎరుకల స్రవంతి తెలిపారు. గత ఆరు నెలలుగా కోతులు గుంపులుగా చేరి విధ్వంసం సృష్టిస్తూ, ఇళ్లలోకి చొరబడి వంట పాత్రలు ఎత్తుకెళ్తున్నాయి. అంతేకాకుండా, 20 మందికి పైగా వ్యక్తులపై దాడి చేసి గాయపరిచాయి. ప్రజలు సహకరించాలని కౌన్సిలర్ కోరారు.