థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని 50 జిల్లాలను అధికారులు డిజాస్టర్ జోన్లుగా ప్రకటించారు. కాలువలు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లు, వాహనాలు నీట మునిగాయి. వరద నీటిని తొలగించేందుకు పంపింగ్ స్టేషన్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.