సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. తెలంగాణలో సమృద్ధి వర్షాలు కురిసి, రైతులు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు.