జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుండి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన చౌరస్తాలు, బస్టాండ్‌లలో కార్యక్రమాలు చేపడతామని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ సంకేతాల పాటింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన తెలిపారు.