రాజన్న సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు, ఎరువులు కొనుగోలు చేసే రైతుల పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. బుధవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్, పెద్దూర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్, స్టాక్ ఎరువుల నిల్వలను పరిశీలించి, విక్రయించిన ఎరువులు, రైతుల వివరాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెర్టిలైజర్ షాపులు ఉదయాన్నే తెరవాలని, సాగుకు అనుగుణంగా ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.