రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం జిల్లాలో పలు మండలాల్లో బీభత్సం సృష్టించింది. వేములవాడ నియోజకవర్గంలో భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యపు రాశులు పూర్తిగా వర్షానికి తడిసిపోయాయి. బస్తాల్లోకి నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.