యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కొండపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్షాటన చేసుకుంటున్న స్థానిక యాచకురాలు ఈశ్వరమ్మను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆలయ అధికారులు, ఆలయ నియమావళి ప్రకారం కొండపై మరణం సంభవించడంతో ఆలయ ద్వారాలను మూసివేసి, భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. శాస్త్రోక్తంగా శుద్ధి, సంప్రోక్షణ పూజల అనంతరం దర్శనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు.