బచ్చన్నపేట మండల కేంద్రంలోనే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాలను శాశ్వతంగా ఏర్పాటు చేయాలని 'క్లీన్ ఫ్యూచర్ సొసైటీ' ప్రెసిడెంట్ గంగరబోయిన మహెందర్, ప్రతినిధులు చింతల కర్ణాకర్, కర్రె నరేష్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. గత 6 ఏళ్లుగా బాలుర, బాలికల గురుకులాలు ఇతర ప్రాంతాల్లో కొనసాగుతుండటంతో స్థానిక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో శాశ్వత భవనాలు నిర్మించాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.