పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎలుకలు కరిచినట్లు వచ్చిన సమాచారంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులను పరిశీలించగా ఎలుక కాటు ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. అనంతరం పాఠశాలలోని వంటశాల, భోజన గది, సరుకుల నిల్వ గది, మరుగుదొడ్లు, విద్యార్థుల గదులను పరిశీలించారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా బయటి వ్యక్తులను పాఠశాలలోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు.