తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తహాశీల్దార్ కార్యాలయం సమీపంలో మోత్కూర్ రోడ్డుపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జాటోత్ ప్రవీణ్ (30) అనే యువకుడు మృతి చెందాడు. హైదరాబాదు నుండి స్వగ్రామానికి వెళ్తుండగా, వేగంగా వస్తున్న బైక్ గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌కు మంటలు అంటుకొని ప్రవీణ్ తీవ్ర గాయాలతో సజీవ దహనమయ్యాడు. మృతుడి ప్యాంటు జేబులో లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం, పడమటి గూడ గ్రామపంచాయతీ పరిధిలోని చారి తండాకు చెందినవాడిగా గుర్తించారు. ఇటీవల కుమారుడు పుట్టిన నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.