దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ హెచ్చరించారు. దీని ప్రభావంతో శనివారం నుండి మంగళవారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. ఏపీపై ప్రస్తుతానికి నేరుగా ప్రభావం లేదని పేర్కొన్నప్పటికీ, వాతావరణ మార్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో తుఫాను గమనాన్ని బట్టి స్పష్టత వస్తుందని వెల్లడించారు.