ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో శుక్రవారం రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో మొత్తం 3, 525మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. అయితే మొదటి జాబితాలో 464 మంది, రెండవ జాబితాలో 692 మంది కలిపి మొత్తం 1156 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని ఎంపీ భరత్ తెలిపారు. జాబ్ మేళా నిర్వహించడంతోనే పని పూర్తి కాలేదని, ఉద్యోగాల్లో చేరిన మూడు నెలల తర్వాత ఫలితాలు చూడాలన్నారు. ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంత మంది మానివేశారు, మానివేశారా కంపెనీ నిర్వాహకులు తీసేశారా, ఎందుచేత. ఇవన్నీ చూడవలసిన బాధ్యత అధికారులదేనని ఎంపీ భరత్ పేర్కొన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో మార్పు రావాలన్నదే తన లక్ష్యం అన్నారు. నేడు ఉద్యోగాలు పొందిన వారిలో కనీసం డబ్భై శాతం మందైనా ఆయా ఉద్యోగాల్లో స్థిరపడితే చాలా సంతోషంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉద్యోగాలు పొందిన యువతకు ఉద్యోగ ధృవీకరణ పత్రాలను ఎంపీ భరత్ రామ్ చేతుల మీదుగా ఆయా కంపెనీల ప్రతినిధులు అందజేశారు.