కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తోంది. ఇంజనీరింగ్ అధికారులు ఏదో ఒక నెపంతో కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. క్యాంపులకు వెళ్ళామని, బిల్లులు చేయడానికి వెళ్ళామని, ఇతర మండలాల్లో పని ఉందని డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారని పత్తికొండ గ్రామీణ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల నుండి నీటి సమస్యలతో ఈ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అధికారుల కోసం ఎదురుచూసి వెనుదిరిగి వెళ్తున్నారు. ప్రధాన అధికారి చాంబర్‌కు తాళం వేయడం కొసమెరుపు. ఈ నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.