ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, వ్యక్తుల్లో పరివర్తన తీసుకొచ్చే సంస్కరణా నిలయాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. విశాఖలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో జరిగిన రెండవ రోజు జాతీయ స్థాయి సదస్సు ముగింపు వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖైదీల సంక్షేమం, ముఖ్యంగా మహిళా ఖైదీల నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పంచుకోవడం ద్వారా జైళ్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ఆమె పేర్కొన్నారు.