విశాఖపట్నం వేదికగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగిన 'హోస్టేజ్ రెస్క్యూ ఆపరేషన్ ఇన్ జంగిల్' విన్యాసాలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. నక్సల్స్ వ్యూహాలను తిప్పికొట్టడం, అడవుల్లో బందీల విముక్తి, పేలుడు పదార్థాల నిర్వీర్యం వంటి అంశాలపై గ్రేహౌండ్స్, ఆక్టోపస్, కేంద్ర బలగాలతో కలిసి ఈ సంయుక్త శిక్షణ నిర్వహించారు. అత్యవసర సమయాల్లో వివిధ భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, వాస్తవ ముప్పులను ఎదుర్కోవడంలో బలగాల సిద్ధతను చాటిచెప్పడం ఈ విన్యాసాల లక్ష్యం. భద్రతా దళాల సహకారం ప్రజా రక్షణకు భరోసానిస్తుందని గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ డా. సుమిత్ గరుడ్ పేర్కొన్నారు.