విశాఖ కేజీహెచ్‌లోని రాజేంద్ర ప్రసాద్ వార్డులో ఓ కాంట్రాక్ట్ నర్సుపై వార్డ్ బాయ్ దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం కాంట్రాక్ట్ నర్సులు విధులు బహిష్కరించి, వార్డులోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఏపీ నర్సుల సంఘం జిల్లా కమిటీ వీరికి మద్దతు ప్రకటించింది. ఆసుపత్రిలో సిబ్బందికి రక్షణ కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ స్వయంగా వార్డుకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.