పోలీసుల నైపుణ్యం పెంపునకు జిల్లా పోలీసు శాఖ చర్యలు

సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏలూరు జిల్లా పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆర్మడ్ రిజర్వు పోలీసులకు వార్షిక పునశ్చరణ తరగతులు బుధవారం నిర్వహించారు. తడికలపూడి ఫైరింగ్ రేంజ్‌లో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించగా, ఏఆర్ అదనపు ఎస్పీ జి. ముని రాజా, డీఎస్పీ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. అధునాతన ఆయుధాల వినియోగం, బాంబు స్క్వాడ్ పనితీరు, మస్కట్రీ, బందోబస్తు మెళకువలు, ఒత్తిడిని అధిగమించడానికి యోగా, వ్యక్తిత్వ వికాసం, శారీరక దారుఢ్యం, సీపీఆర్ విధానం, సర్వీసు రూల్స్, సంక్షేమ పథకాలు, నిజాయితీపై శిక్షణ ఇచ్చారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి. ముని రాజా మాట్లాడుతూ, ఆర్మడ్ రిజర్వు విభాగం పోలీసు వ్యవస్థకు వెన్నెముక అని కొనియాడారు. "యూనిఫాం ధరించిన ప్రతి ఒక్కరూ ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణ కోసం పునరంకితం కావాలి. విధులతో పాటు ఆరోగ్యం, కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి" అని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ఉన్నత పదోన్నతులు సాధించాలని సిబ్బందిని ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్