విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (ఎఫ్ఐఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ మంగళవారం కేంద్ర విమానయాన శాఖకు లేఖ రాసింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షల వరకు పెరిగాయని, ఇది విమానయాన సంస్థలపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని ఎఫ్ఐఏ తెలిపింది. 30-40% ఉండే ఇంధన ఖర్చు ప్రస్తుతం 55-60%కి పెరిగిందని, దీనివల్ల విమాన సర్వీసులను తగ్గించడం, రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, చివరికి విమాన టిక్కెట్ల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొంది.