TG: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం సరికొత్త ఆరోగ్య బీమా పథకాన్ని (EHS) జులై 15 నుండి అమలు చేయనుంది. ఈ పథకం నిర్వహణకు ఏర్పాటు చేసిన 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' బోర్డు సమావేశంలో, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దంపతులైతే ఒకరి జీతం నుంచే ప్రీమియం కట్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల వేలాది ఉద్యోగ దంపతులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. వారం రోజుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమై ప్యాకేజీ ధరలు, నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాను ఖరారు చేయనున్నారు. అనంతరం కొత్త హెల్త్ కార్డుల జారీ, మార్గదర్శకాలు విడుదల చేయబడతాయి.