పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత ఎరువుల రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముడి పదార్థాల ధరలు, దిగుమతి ఖర్చులు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎరువుల సబ్సిడీ వ్యయం రూ.3 లక్షల కోట్లను దాటవచ్చని ఎరువుల శాఖ జాయింట్ సెక్రటరీ కృష్ణకాంత్ పాఠక్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం 2 కోట్ల టన్నులకుపైగా ఎరువుల నిల్వలు ఉన్నప్పటికీ ఖర్చు భారీగా పెరుగుతోంది. యూరియా వినియోగంలో 30% మాత్రమే పంటలకు ఉపయోగపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం, దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.