విజయవాడ తుమ్మలపల్లి కాలక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా వైకాపా ఎస్సి సెల్ విజయవాడ నగర ఎస్సి సెల్ ఆధ్వర్యంలో సోమవారం అసెంబ్లీ వేదికగా వైకాపా ఎమ్మెల్యేలపై దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ లిడ్ క్యాప్ డైరెక్టర్ డా. కోనేరు సత్య ప్రియ, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, బొప్పన భవ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుండి కంట్రోల్ రూమ్ వరకు పాదయాత్రగా వెళ్లి నిరసన తెలుపుతూ చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ డైరెక్టర్ కోనేరు సత్యప్రియ మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వాళ్ళు వైకాపా ఎస్సి ఎమ్మెల్యేలపైనా దాడులు చేయడం హేయమన్నారు. టీడీపీ వాళ్ళు ప్రజా స్వామ్యాన్ని ఖూని చేశారన్నారు. చంద్రబాబు ఇక అసంబ్లీలో అడుగు పెట్టలేరన్నారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రౌడీలా వ్యవహరించిన తీరు అప్రజస్వామికం అని అమె అన్నారు. చంద్రబాబు చేసే కుటిల రాజకీయాలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. ఎస్సిలు అంతా వైకాపాకు మద్దతుగా ఉన్నారన్న ఆలోచనతో ఈ కుట్రలకు చంద్రబాబు తేర తీశారన్నారు.