మైలవరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో మైలవరంలో జరుగుతున్న రిలే నిరసన దీక్షకు మద్దతుగా మార్చి 10న రెడ్డిగూడెంలో తలపెట్టిన అఖిలపక్ష బంద్ ను జయప్రదం చేయాలని డివిజన్ సాధన సమితి నాయకులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ అన్ని ప్రాంతాల ప్రజలకు కేంద్రబిందువుగా ఉంటే పరిపాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.
నూతనంగా ప్రభుత్వం ప్రకటించిన తిరువూరు డివిజన్ పరిధిలోని మండలాలు అన్ని ఒక వైపు ఉంటే డివిజన్ కేంద్రం మాత్రం 50 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తిరువూరు ను ఏర్పాటు చేయటం భౌగోళికంగా జగన్ ప్రభుత్వానికి అవగాహన లేకపోవడమే కారణం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాలోచితంగా తిరువూరు పట్టణాన్ని రెవిన్యూ డివిజనల్ కేంద్రంగా ప్రకటించడాన్ని మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని మైలవరంను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చాట్ల చందా. తెదేపా నాయకులు చాట్ల చంటి, మల్లాది చిన్నలాజర్, చాట్ల శేఖర్, పాడిశాల చంటి తదితరులు పాల్గొన్నారు.