ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను తొలంగించడంతో ఉపాధ్యాయులే పాఠశాలలు శుభ్రపరచుకొంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ పనులు చేయాలని ఉత్తర్వులు ఉన్నా, ఏదో ఒక రోజు చేయడం, తర్వాత పట్టించుకోక పోవడం సాధారణం అయింది. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలను చూడలేక ఉపాధ్యాయులు బాత్ రూమ్ లు కడగడం, బూజులు దూలపడం, ఊడ్చడం, బాత్రూంలో నీళ్లు పెట్టడం, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. డోర్నకల్ మండలంలోని బొడ్రాయి తండా ఉన్నత పాఠశాలను అక్కడి ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా రాణి, సహ ఉపాధ్యాయులతో కలిసి శుభ్రం చేశారు. పాఠశాలకు వచ్చే పిల్లల జాగ్రత్త తమకు ముఖ్యమని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.