చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన ఎస్. కె. సబీర్, ఎస్. కె. జబీర్ ఇద్దరూ మామా అల్లుళ్లు. గురువారం పనిమీద ద్విచక్రవాహనం పై బకింగ్ హామ్ కెనాల్ కరకట్ట మీదుగా వెళ్తూ ఉండగా, వడ్డేశ్వరం ఆంజనేయ రెస్టారెంట్ వద్ద లోపల వైపు నుంచి ద్విచక్ర వాహనం ఒకటి వచ్చి సబీర్ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో సబీర్ మామ జబీర్ ద్విచక్ర వాహనం మీద నుంచి వెనక్కు పడి తలకు తీవ్రమైన గాయమవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.