నిత్యపూజకొనలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రజలు సహకరించాలని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి తెలిపారు. మండలంలోని నిత్యపూజకొనలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 1 వరకు జరిగే మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆయన ఒంటిమిట్ట సీఐ రాజా ప్రభాకర్, సిద్దవటం ఎస్సై మధుసూదన్ రెడ్డితో కలిసి సోమవారం చెక్ పోస్టులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. భక్తులు ప్రయాణం చేసే వాహనాలు ఈద్గా వద్దే నిలిపివేస్తామని, ఈద్గా వద్ద నుంచి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో పంచాలింగాల వరకు చేరుకోవాలన్నారు.
భక్తులు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు విలువైన ఆభరణాలు, వస్తువులు తీసుకొని రాకూడదన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉత్సవాల్లో తప్పిపోయే అవకాశం ఉందని వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎవరైనా తప్పిపోతే పంచాలింగాల వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేస్తామని అక్కడ ఫిర్యాదు చేయవచ్చునన్నారు. భక్తులు కోవిడ్ నిభందనలు తప్పనిసరిగా పాటించాలని మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు.