సౌమ్యా..ఒంటరివాన్ని చేసి వెళ్లిపోయావా బంగారం

276860చూసినవారు
సౌమ్యా..ఒంటరివాన్ని చేసి వెళ్లిపోయావా బంగారం
నా పేరు సూర్య (పేరు మార్చాము) మాది భద్రాద్రి జిల్లా. అందరిలాగానే ఇంటర్మీడియెట్ మంచి మార్కులతో పూర్తి చేసుకొని ఒక ప్రముఖ డిగ్రీ కళాశాలలో చేరాను. చేరిన మొదటి రోజే కొత్త కొత్త స్నేహితుల పరిచయాలు చాలా బాగున్నాయి. ఇంతలోనే మా రెండవ వరుస బెంచీలో సౌమ్య కనిపించింది. చందమామ కాంతి వంటి అందమైన, ప్రశాంతవంతమైన ముఖం ఆమెది. చక్కని చిరునవ్వు. ఆ చిరునవ్వు చూస్తూ జీవితాంతం అలా ఉండిపొవచ్చని పించింది. రోజులు, వారాలు, నెలలు.. చూస్తుండగానే అలా డిగ్రీ మొదటి సంవత్సరం గడిచిపోయింది.

డిగ్రీ రెండవ సంవత్సరం కూడా మొదలైంది. తనతో ఎలాగో ఒకలాగా మాటలు కలిపి మాట్లాడాను. రెండవ సంవత్సరం గడిచిపోయింది. తనది అందరికి సహాయం చేసే మనసు. అన్ని ప్రోగ్రామ్స్ లో తను చురుకుగా పాల్గొనేది. ఈ లోగా మాకు రెండవ సంవత్సరం వేసవి సెలవులు వచ్చేశాయి. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం మా స్నేహితులతో కలిసి హైద్రాబాద్ లో ఒక చిన్న జాబ్ చూసుకున్నా. అలా ఆ వేసవి గడిచిపోయింది.

ఈ లోగా మాకు డిగ్రీ మూడవ సంవత్సరం తరగతులు మొదలయ్యాయి. వెంటనే నేను ఎప్పుడు కాలేజీకి వెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. సౌమ్యను చూడాలని ఆరాటపడ్డాను. కానీ జాబ్ వదిలేసి రాలేని పరిస్థితి. కాలేజీ తెరిచి అలా ఒక నెల గడిచిపోయింది. నేను ఎలాగో అలాగా ఇంటికి వచ్చి కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చాను. నా స్నేహితులందరూ నన్ను చూసి షాకయ్యారు. అప్పటి వరకు ఏదో ఒకలాగా ఉండే నేను జాబ్ చేస్తూ నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేశాను. అలా కాలేజీకి వెళ్లే మొదటి రోజుకు ముందు రాత్రంతా బాగా ఆలోచించాను.

తనకు నా లవ్ ప్రపోజల్ గురించి చెప్తే ఎలా ఫీల్ అవుతుంది, అసలు ఒప్పుకుంటుందా లేదా ఒప్పుకుంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందని ఆలోచించసాగాను. అలా ఆలోచిస్తుండగా రాత్రి 12 గంటలు దాటింది. ఇక తెల్లవారుజామున పొద్దున్నే నిద్రలేచి ఎప్పుడు కాలేజీ టైం అవుతుందా అని గడియారం వైపు చూస్తూ ఉండిపోయాను. అలా చూస్తుండగానే తెల్లవారింది.

తనకు ఊరికే ప్రపోజ్ చేయకుండా హైద్రాబాద్ లో ఒక మంచి వాచీ తీసుకున్నాను. (మూడు నెలల ముందే). దాన్ని ఇంట్లో ఎవరి కంటా పడకుండా దాచిపెట్టి ఆ రోజు జేబులో వేసుకొని కాలేజికి బయలుదేరాను. కాలేజీ ఓపెన్ చేసిన కొత్తలొనే కాబట్టి మాకు మధ్యాహ్నం వరకే కాలేజీ ఉంది. మూడవ సంవత్సరంలో మా బెంచీలు మారాయి. తను చివరికి వెళ్ళిపోయింది. నేను మాత్రం ముందే ఉండిపోయాను.

ఇంటర్వెల్ కి ముందు తనకి నేను ఇలా సైగలు చేశాను.(నువ్వు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం సేపు ఆగు అని నా సైగల ద్వారా తనకి చెప్పాను). అలా నేను చెప్పినట్టుగానే తను చేసింది. కాలేజీలో అందరూ ఇంటికి వెళ్లిపోయినా తను మాత్రం నేను చెప్పినట్లు నాకోసం కాలేజీ ముందు వెయిట్ చేస్తుంది. ఈ లోగా అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. నేను చిన్నగా నా అడుగులు తన వైపు కదిపాను.

అలా తన దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నావు అని అడగడంతో మొదలుపెట్టి చిన్నగా అలా మాట్లాడుకుంటూ నా జాబ్ విషయం చెప్పాను. అలా చెప్పగానే తను నిజమా.. నీకు జాబ్ వచ్చిందా.. అని కంగ్రాట్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ.. తన కోసం తీసుకొచ్చిన వాచీని తనకి ఇచ్చాను. తను తీసుకొని చాలా బాగుంది అని అంది. అప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పాలని అన్నాను.

ఇక ఆలస్యం చేయకుడా I LOVE YOU ... అని నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పాను. అది విన్న తను అదేంటి అని అంది. నాకు ఇంకొక వ్యక్తితో పరిచయం ఉందని, అలా ఉన్న విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసని చెప్పింది. నేను అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. తను అలా చెప్పగానే నాకు మతి పోయేంత పనైంది. అప్పుడు నేను తనను నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగాను. అప్పుడు తను నువ్వు మంచి వాడివే. కాదనడం లేదు. కానీ అల్రెడీ నాకు ఇంకొక వ్యక్తి అంటే ఇష్టం ఉందని చెప్పా కదా అంది. అలా చెప్పడంతోనే నాకు అక్కడి నుండి వెళ్లిపోవాలనిపించి వెళ్ళిపోయాను. వెళ్తూ ఉంటే ఒకసారి పిలిచింది. కానీ నాలో ఉన్న బాధ వల్ల వెనకకు చూడలేదు. మళ్ళీ ఒక గంట తరువాత మా వేరే ఫ్రెండ్ తో నేను ఇచ్చిన వాచీని నాకు తిరిగి పంపించేసింది.

అలా కొన్ని రోజులైపోయాయి. నాకు తనకు మాటలు కట్ అయిపోయాయి. నేను క్లాస్ లో తనను చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నాను. తన గురించే ఆలోచిస్తూ ఆ బాధలో నుండి బయట పడడానికి నాకు 6 నెలలు పట్టింది. ప్రతి రోజు రాత్రి తినేటప్పుడు తను తిన్నదా లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఒక రోజు తను ఆమె ఫ్రెండ్ తో నాకు ఒక కబురు పంపించింది. తన ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళేటప్పుడు ఒకసారి అంట ఆగు అని చెప్పి వెళ్ళిపోయింది. నేను కొంచెం దూరం వెళ్లి ఆగాను. సౌమ్య నా దగ్గరకు వచ్చి ఇలా అంది. ఎందుకు ఊరికే నా వైపు చూస్తూనే ఉంటున్నావు.. ఇంకొకసరి అలా పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే బాగోదు. నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా అని నాకు వార్నింగ్ ఇచ్చింది.

ఇక నేను తనను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. కాలేజిలో అసలు తన ముఖమే చూడకపోయేవాన్ని. కానీ మా ఊరు నుండి వాళ్ల ఊరికి ఒక 8 కిలో మీటర్ల దూరం ఉంటది. నేను మాత్రం ప్రతీ ఆదివారం తనను చూడటం కోసం సైకిల్ మీద 8 కిలోమీటర్లు వెళ్లి తనకు తెలియకుండా వారి ఊళ్లో తనను చూసి వచ్చేవాడిని. అలా డిగ్రీ కూడా అయిపోయింది.

లోకల్ లోనే ఉంటూ చిన్న జాబ్ చూసుకొని M.B.A కట్టాను. డిగ్రీ అయిపోయిన తరువాత వేసవి సెలవుల్లోనే తను కోరుకున్న అబ్బాయితో తనకు పెళ్లి జరిగిపోయిందని మా స్నేహితుల ద్వారా తెలిసింది. నేను మరోసారి పిచ్చి వాన్నయ్యాను. కాలం నా కోసం వెనక్కి తిరిగి వెళ్లదుగా అనుకొని చిన్నగా తనను మర్చిపోవాలని అనుకున్నాను. 4 సంవత్సరాల తర్వాత తను ఒకసారి నాకు కనిపించింది. అప్పుడు తనే ముందుగా బాగున్నావా అని అడిగింది. నేను కూడా తనతో కాసేపు మాట్లాడాను. నేను అదే చివరి సారి తనతో మాట్లాడడం. ప్రస్తుతం తన ఆచూకీ నాకు తెలియదు. వాళ్ల ఊళ్లో అయినా కనిపిస్తుందేమోనని ప్రతి ఆదివారం ఇప్పటికి కూడా వారికి ఊరికి వెళ్లి వస్తుంటాను. తను నాతో లేకపోయినా తనను తలచుకొని, నా కళ్ళు మూసుకుంటే తను నా కళ్ళ ముందు నా ఊహల్లో కనిపిస్తుంటుంది. తను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ దేవుడిని ప్రార్దిస్తుంటాను.

ఫ్రెండ్స్ మీరెవరినైనా ప్రేమిస్తే వెంటనే చెప్పండి. నాలాగ ఆలస్యం చేస్తే వారి మనస్సులో వేరొకరు స్థానం సంపాదించుకుంటారు. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే తనకు నా ప్రేమ గురించి చెబితే నా జీవితం ఎలా ఉండేదో. కానీ తన మనస్సులో వేరొకరు ఉన్నారని తెలిసి కూడా నేను బయటపడలేకపోయాను. అది మాత్రం నిజంగా నా తప్పే. ఫ్రెండ్స్ ఒకరి ప్రేమ దక్కనంత మాత్రాన మన జీవితం ముగియదు. మనకు అంతకంటే మంచి జీవితం ఉంటది. మనకు ఒకరు దక్కలేదంటే వారికంటే మంచివారు మన జీవితంలోకి రాబోతున్నారని అర్దం. సౌమ్య దూరం పెట్టినా నేను ఆమె నాలాగా ఎవరికైనా అయితే మాత్రం మీరు ఆలస్యం చేయకుండా మీ జీవితం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నేను మా గ్రామంలోనే పని చేసుకుంటూ జీవిస్తున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలిగాను. నాకు కూడా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. త్వరలనే నేను కూడా పెళ్లి చేసుకోబోతున్నాను.

"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

గమనిక.. వారానికి ఒక కథను మాత్రమే ప్రచురిస్తాం. దీనిని లోకల్ యాప్ ట్రెండింగ్ కేటగిరిలో చూసుకోవచ్చు.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.