నందిగాం మండలం నౌగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా, ఏ.యన్.యమ్. లకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో నందిగాం 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ దేవాది శ్రీనివాసరావు నౌగాం పరిధిలో ఉన్న మహిళలు, బాలింతలు, గర్భిణులు, 108 సేవలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. గర్భిణీలు ప్రతి నెల 9 వ తేదీన చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి వెళ్లేందుకు ఈ 108 సేవలను వినియోగించుకోవాలని, అదే విధంగా శిశు మరణాల రేటు తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవజాత శిశు అంబులెన్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పిస్తూ నవజాత శిశు అంబులెన్స్ లను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
అలాగే డయాలసిస్, తలసేమియా, రక్త మార్పిడి, కీమోథెరపీ, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లేందుకు 108 సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. చికిత్స నిమిత్తం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికే కాకుండా పేషెంట్ సహాయకులు కోరిక మేరకు సమీప ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగాం 108 సిబ్బంది దేవాది శ్రీనివాసరావు, వాన కుమారస్వామి పాల్గొన్నారు.