చెంప దెబ్బలు తిని.. లక్ష్మీ ప్రేమని గెలిచాడు

308620చూసినవారు
చెంప దెబ్బలు తిని.. లక్ష్మీ ప్రేమని గెలిచాడు
మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. నా పేరు నర్సింహ్మా (పేరు మార్చాం). నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మా గ్రామంలోనే మా నాన్నకు సహాయపడుతూ వ్యవసాయం చేస్తున్నాను. అదే సమయంలో మా గ్రామానికి పశువుల డాక్టర్ గా లక్ష్మీ (పేరు మార్చాం) వచ్చింది. లక్ష్మీని చూసిన మొదటి సమయంలోనే నేను ఆమెకు పడిపోయాను. ఆ తర్వాత మా పశువులను తీసుకొని ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆమెను చూసి తననే నా భార్యగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను.

అలా నేను ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాను. ఈ విషయాన్ని ఎలాగైనా లక్ష్మీకి చెప్పాలని డిసైడయ్యాను. అలా మా పశువులకు ఏం కాకున్నా కూడా ఏదో రోగం వచ్చిందన్న సాకుతో పశువులను తీసుకొని ఆస్పత్రికి వెళ్లేవాన్ని. అలా తనతో నాకు పరిచయమైంది. తనకు కూడా అర్థమైంది పశువులను కావాలని తీసుకువస్తున్నానని. ఓ సారి గట్టిగా అడిగింది. పశువులు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఎందుకు తీసుకువస్తున్నావంటూ నిలదీసింది. అప్పుడు నేను ఏ మాత్రం భయపడకుండా దైర్యంతో నీవంటే ఇష్టం..నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాను. అంతే తను నా చెంప మీద రెండు పీకింది. అసలు ఏం అనుకుంటున్నావు నువ్వు.. మాట్లాడినంత మాత్రాన ప్రేమ దోమ అంటావా అని కోపంతో రగిలిపోయింది. నేను కూడా అవమానంతో బయటికి వెళ్లిపోయాను.

అలా వారం రోజుల దాకా మళ్లీ లక్ష్మీ ముఖం చూడలేదు. ఇంతలో లక్ష్మీ రోజు వారీగానే ఆస్పత్రికి వచ్చి వెళుతుంది. ఓ సారి నేరుగా ఆస్పత్రికి వెళ్లాను. ఈ సారి లక్ష్మీ ముఖంలో కోపం లేదు. నన్ను చూడగానే నవ్వింది. అప్పుడు నాకు అర్దమైంది తను కాస్త తగ్గిందని,నేనంటే ఇష్టపడుతుందని కూడా అర్ధమైంది. అలా మా చూపులు కలిసాయి. ఆ రోజే ఫోన్ నంబర్ తీసుకున్నాను. అలా మెసేజ్ లు చేసుకునేవాళ్లం, ఫోన్ లో మాట్లాడుకునేవారం. అలా రెండు సంవత్సరాలు మా ప్రేమాయణం సాగింది.

ఇంతలో లక్ష్మీకి వారి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను వెళ్లి వారింట్లో నేరుగా చెప్పాను. లక్ష్మీ నేను ప్రేమించుకుంటున్నాం..పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పాను. దానికి వారు అంగీకరించలేదు. నన్ను తిట్టి పంపారు. లక్ష్మీని వారం రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. ఓ రోజు తను ఆస్పత్రికి తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి ఉండడంతో ఆస్పత్రికి వచ్చింది. లక్ష్మీ వస్తున్న విషయం తెలుసుకొని నేను కూడా ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ ఆమె పని పూర్తి కాగానే నేరుగా ఓ దేవాలయం వెళ్లి పెళ్లి చేసుకున్నాం.

మా ఇరు కుటుంబాల వారు మా పెళ్లిని ఆమోదించలేదు. కేసులు పెట్టారు. మేజర్లం కావడంతో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి మా కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు.కానీ వారు అందుకు అంగీకరించలేదు. దీంతో మేం అద్దె ఇంట్లో కాపురం పెట్టాం. తను ఆస్పత్రికి వెళ్లేది. నేను కాంట్రాక్టర్ పని చూసుకున్నాను. ఇంతలో రెండు సంవత్సరాలు గడిచాయి. మాకు పాప పుట్టింది. అప్పుడు మా నాన్న ఇంటికి రమ్మని పిలిచాడు. దీంతో మేం మా తల్లిదండ్రులతో కలిసి ఉన్నాం. లక్ష్మీ వాళ్ల తల్లిదండ్రులను కలిసే ప్రయత్నం చేసినా వారు మమ్ముల దగ్గరికి కూడా రానివ్వలేదు. మా పాపని చూసైనా మారుతామనుకున్నా వారు మారలేదు. చివరికి పాపు పుట్టిన రోజు సమయాన వారు మాతో కలిశారు.

ఆలస్యమైనా మా కుటుంబ సభ్యులు మాతో కలిశారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం..మా ఇరు కుటుంబాలు కలవడం సంతోషాన్ని కలిగించింది. నేను కూడా కాంట్రాక్టర్ గా ఉన్నత స్థానంలో ఉన్నాను. మాకు ఇప్పుడు ఇద్దరు కూతుర్లు,ఒక బాబు. లక్ష్మీ ఉత్తమ పశువైద్యాధికారిగా పని చేస్తుంది. మొత్తానికి నా ప్రేమలో ముందుగా ఆటంకాలు ఎదురైనా ఇప్పుడు సంతోషంగానే బతుకుతున్నాం.

ఇట్లు.. మీ మిత్రుడు నర్సింహ్మా


"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

గమనిక.. వారానికి ఒక కథను మాత్రమే ప్రచురిస్తాం. దీనిని లోకల్ యాప్ ట్రెండింగ్ కేటగిరిలో చూసుకోవచ్చు.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.