లవ్ ఫెయిల్..ఐనా సంతోషంగా సరస్వతి

152890చూసినవారు
లవ్ ఫెయిల్..ఐనా సంతోషంగా సరస్వతి
నా పేరు సరస్వతి. మాది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామం. మాది మామూలు మధ్య తరగతి కుటుంబం. నేను చదువులో చురుకుగా ఉండేదాన్ని. మా ఇంటి పక్కకే నరేష్ ఉండేవాడు. మేం ఒకే తరగతి కావడంతో చాలా స్నేహంగా ఉండేవాళ్లం. టెన్త్, ఇంటర్ ఒకే స్కూల్, ఒకే కాలేజిలో చదవడంతో మేం చాలా క్లోజ్ అయ్యాం. డిగ్రీలో కూడా ఒకే కాలేజిలో చేరాం. అలా డిగ్రీ సమయానికి మా మధ్య ప్రేమ బంధం ఏర్పడింది.

అప్పుడు మా దగ్గర ఫోన్ కూడా లేదు. ఇంటి పక్కనే కావడంతో ఇంట్లో వారిమి కూడా స్నేహంగా ఉండేవాళ్లం. కాలేజిలోనే మాట్లాడుకునేవాళ్లం. రాను రాను నరేష్ పై నాకు కూడా ప్రేమ పెరిగింది. నరేష్ చాాలా మంచివాడు. మానవత్వం ఉన్న వ్యక్తి. ఓపిక ఎక్కువ. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మేం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా రోజులు గడుస్తున్నాయి.
నేను డిగ్రీ సెకండియర్ లో ఉండగానే నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. నాకు టెన్షన్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నరేష్ తో చెప్పాను. నరేష్ చాలా టెన్షన్ కు గురయ్యాడు.

అప్పటికి నరేష్ ఇంకా సెట్ కాలేదు. అంతే కాకుండా మా ఇద్దరివి వేర్వేరు కులాలు. ఇవన్నీ ఆలోచించాం. ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాకు రెండు మూడు సంబంధాలు వచ్చాయి. నేను వాటిని ఏదో కారణం చెప్పి తప్పించాను. చదువు అయ్యాకే చేసుకుంటానని చెప్పాను. కానీ మా ఇంట్లో నా మాట వినలేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ కు చేరాను. నరేష్ నేను కాలేజిలో మాట్లాడుకునేవాళ్లం తప్ప ఇంటి దగ్గర మాట్లాడుకునేవాళ్లం కాదు.

రాను రాను మాలో టెన్షన్ పెరిగింది. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఇంతలోనే మా ప్రేమ విషయం ఒకరి ద్వారా మా ఇండ్లలో తెలిసింది. అంతే అప్పటి వరకు ప్రేమగా చూసుకున్న అమ్మ, అన్న నేను ఏదో తప్పు చేసినట్టుగా చూశారు. తిట్టారు. కులాలు వేరైనందునా ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసేది లేదని చెప్పారు. నరేష్ వాళ్ల అమ్మనాన్నలు మా ప్రేమకు అంగీకరించారు. కానీ వాళ్లు ఏం చేయలేని స్థితి. ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే మా శవాలే ఇంట్లో ఉంటాయని, మా చావుకు కూడా రావద్దని అమ్మ, అన్న నాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

వారి దగ్గర పురుగుల మందు డబ్బాలు పెట్టుకొని తిరిగారు. నేను పిచ్చిదాన్ని అయిపోయాను. ఏం చేయలేని స్థితి. ఇంతలో బంధువుల ద్వారా నాకొ సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి వ్యవసాయం చేస్తాడు. నాకు ఇంట్లో పెళ్లి చూపుల విషయం తెలిసి నరేష్ ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడు. మా అమ్మ,అన్న ఒత్తిడితో పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. ఆ తర్వాతి రోజు నరేష్ ను నేను రహస్యంగా కలిసాను. ఎటైనా పోదామని ఒత్తిడి తెచ్చాడు. అమ్మ, అన్న చస్తానంటున్నారని చెప్పా. వాళ్లు అలా భయపెడుతారని అన్నాడు. కానీ నిజంగానే అన్నంత పని చేస్తే పరిస్థితి ఏంటని ఆలోచించా. ఇద్దరం బాధపడ్డాం.

నరేష్ తల్లిదండ్రుల మద్దతు ఉంది కాబట్టి లేచిపోయి పెళ్లి చేసుకుందామని ఆలోచించా. కానీ మళ్లీ భయం వెంటాడింది. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. ఇప్పుడు నా కారణంగా అన్న, అమ్మ దూరమైతే ఎలా అని ఆలోచించాం. మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా అన్న,అమ్మను ఒప్పించినా వారిలో ఎటువంటి మార్పు లేదు. దీంతో మేం విడిపోయాం. నరకం అనుభవించాను. ఇప్పుడు నేను చావడమే మార్గమనుకున్నాను. కానీ దైర్యం రాలేదు.

ఇంట్లో చూసిన వారితో నాకు పెళ్లయ్యింది. నరేష్ పిచ్చి వాడయ్యాడు. నేను పిచ్చిదాన్నయ్యాను. కన్నీటితోనే అత్తగారింటికి వెళ్లాను. నరేష్ తల్లిదండ్రులు అతనిని ఊరిలో ఉంచకుండా హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ లో బంధువుల ఇళ్ల దగ్గర ఉండి పీజీ పూర్తి చేశాడు. దాదాపు 2 సంవత్సరాలు ఎవరిమి ఎవరిని చూసుకోలేదు. మా మనసులలో మెదలుతున్నాం కానీ ఏం చేయలేని స్థితి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా భర్తను మోసం చేయకూడదనుకున్నాను. జరిగినది మారదు కాబట్టి జరగాల్సిన దాని గురించి ఆలోచించాను.

ఓ రోజు మా ఊరికి వెళ్లినప్పుడు నరేష్ తల్లిదండ్రులతో మాట్లాడాను. ఆ రోజు నరేష్ ఇంటికి వచ్చాడు. నరేష్ ను చూశాక కన్నీరు ఆగలేదు. కాసేపటికి తేరుకున్నాక నరేష్ తో మాట్లాడాను. ఇంకో పెళ్లి చేసుకొని ఉన్నత జీవితం గడపమని కోరాను. ఈ లోకంలో ప్రేమించిన వారందరికి వారు ప్రేమించిన వారితోనే పెళ్లి కావాలంటే అసలు ఈ లోకంలో పెళ్లిలే జరగవని చెప్పి పెళ్లి చేసుకునేలా ఒప్పించాను. కొన్ని నెలల తర్వాత నరేష్ కు కూడా వివాహమైంది. నరేష్ ప్రస్తుతం ఓ మంచి కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు. ప్రస్తుతం నాకు ఇద్దరు పిల్లలు. నరేష్ కు కూడా ఇద్దరు పిల్లలు.

ఒకే ఊరు కావడంతో పండుగల సమయాన కలుస్తుంటాం. గతంలో ఉన్న బాధ ఇప్పుడు లేదు. ఇరువురం సంతోషంగా ఉంటున్నాం. ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. జరిగినది మారదు. జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. మా కథ మీకు సింపుల్ గా అనిపించవచ్చు. కానీ మేం కూడా బాధపడ్డాం కానీ తర్వాత సంతోషంగా ఉండగలుగుతున్నాం కదా. మీరు కూడా ప్రేమ విఫలమైందని బాధపడకుండా జరగాల్సిన దాని మీద ఫోకస్ పెట్టి ముందుకు వెళ్లండి.

మిత్రులారా.. ప్రేమించిన ప్రతి ఒక్కరికి ప్రేమించిన వారితోనే పెళ్లిళు కావాలంటే కావు. అలా కావాలంటే అసలు ఈ లోకంలో ఎవరికి పెళ్లి కాదు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తప్పవు. అలా అని దానిని మోసంగా చూడవద్దు. ప్రేమించిన వారందరు ఏదో బలమైన కారణం ఉంటేనే దూరం అవుతారు కానీ ఊరికే కాదు. ప్రేమలో విఫలమైనంత మాత్రాన అన్ని కోల్పోయినట్టు కాదు. మీరు కూడా మీ జీవితంలో మంచి చెడులను ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.

ఇట్లు.. మీ సోదరి.. సరస్వతి

"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.