ఒకరితో ప్రేమ పెళ్లి..మరొకరితో స్నేహం

340552చూసినవారు
ఒకరితో ప్రేమ పెళ్లి..మరొకరితో స్నేహం
హాయ్ నా పేరు ప్రీతి. నా స్వస్థలం ఏపీ. మాది ఒక మధ్య తరగతి కుటుంబం. నన్ను మా డాడీ చాలా బాగా చూసుకునేవాడు. బాగా చదువుకొని నేను గొప్ప స్థాయిలో ఉండాలని ఆశించాడు. నేను కూడా బాగానే చదివాను. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు సురేష్ అనే అబ్బాయి నా వెంట పడ్డాడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అప్పుడు నాకు ఏం అర్ధం కాలేదు. ఏది తప్పు ఏది చెడు అని ఆలోచించలేకపోయాను. నేను కూడా అతనికి ఓకే చెప్పాను.

ఈ విషయం మా ఇంట్లో వారికి తెలిసింది. నన్ను కొట్టారు. తిట్టారు. మా నాన్న సురేష్ గురించి ఎంక్వైరీ చేశాడు. సురేష్ కు చెడు అలవాట్లు ఉన్నాయని నాతో చెప్పాడు. కానీ నేను అది నమ్మలేదు. కావాలని చెబుతున్న మాటలని మా నాన్న పైనే కోపం పెంచుకున్నాను. మమ్మల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని అరిచాను. ఆత్మహత్యాయత్నం కూడా చేశాను.

ఇంతలో నేను మేజర్ ను అయ్యాను. ఓ రోజు సురేష్ నేను రహస్యంగా వెళ్లి సురేష్ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. దీంతో ఇరు పక్షాల నుంచి గొడవలు అయ్యాయి. నా తల్లిదండ్రులు అవమాన భారంతో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దేవుని దయతో అదృష్టం కొద్ది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నేను ప్రేమ మైకంలో కళ్లు మూసుకుపోయి ఏది మంచి ఏడి చెడు అని కూడా ఆలోచించలేకపోయాను.

ఇంతలో నా పెళ్లి అయ్యి రెండు నెలలు గడిచిపోయాయి. ఇక నాకు నరకం ప్రారంభమైంది. సురేష్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. రోజు పనికి వెళ్లేవాడు కాదు. అందరిని మోసం చేసుకుంటూ అక్కడ ఇక్కడ అప్పులు చేసేవాడు. అలా నరకంలోనే నేను సంసార సాగరాన్ని నెట్టుకొస్తున్నాను. ఇంతలో నాకు పాప పుట్టింది. అప్పుడే నాకు ఓ సంచలన నిజం తెలిసింది. వేరే మహిళలతో అతనికి సంబంధం ఉందన్న విషయం తెలిసి నేను షాక్ అయ్యాను.

దీని పై సురేష్ ను నిలదీసి గొడవ పెట్టుకున్నాను. దీంతో అతను నన్ను తీవ్రంగా కొట్టాడు. ఇంట్లో నుంచి వెళ్లకుండా బంధించాడు. నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. మా వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేసినా కలవకుండా చేశాడు. అప్పుడు గుర్తు వచ్చింది నాన్న అప్పుడు సురేష్ ను ఎందుకు వద్దన్నాడో. తొందరపడి నాన్న చెప్పిన మాటలు వినకుండా పెళ్లి చేసుకున్నాను. అంత బాధలో కూడా నాన్న ఏదైనా బాధ వస్తే ఇంటి తలుపు తట్టమ్మా..నీ కోసం నా గుండె ఎదురు చూస్తూనే ఉంటుందన్నాడు. ఆ మాటలు తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. ఏ ముఖం పెట్టుకొని నాన్న దగ్గరికి వెళ్లాలని బాధపడ్డాను.

ఇప్పటికే ఆడపిల్లకు తల్లినయ్యాను. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని బాధపడ్డాను. నాన్న చెప్పిన మాటలు విననందుకు ఈ శిక్ష నేను అనుభవించాల్సిందే అని నాకు నేను అనుకున్నాను. సురేష్ నెలకు 10 రోజులు పనికి వెళ్లేవాడు. ఓ పూట తిని, ఓ పూట తినక గడిపేదాన్ని. అత్త, మామలకు చెప్పినా స్పందన లేదు. ఇంతలో నాకు మరో పాప జన్మించింది. రెండో పాప పుట్టిన తర్వాతనైనా మారుతాడనుకున్నాను. కానీ తనలో ఎలాంటి మార్పు లేదు.

పిల్లల ముఖం చూసి అన్నింటికి సర్దుకుపోయాను. అయినా మారలేదు. జల్సాలు చేస్తూ అమ్మాయిలతో తిరిగేవాడు. నన్ను, నా పిల్లలను కొట్టి ఇంట్లో నుంచి గెంటేసేవాడు. పంచాయతీలు పెట్టించాను. పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ లు ఇప్పించాను. అయినా కూడా మారలేదు. నాకు తెలిసిన అసలు నిజం ఏంటంటే.. నన్ను కూడా వాడుకొని వదిలేసేందుకే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్నాను. ఈ విషయం తెలిసి నేను చాలా కుమిలిపోయాను.

ఓ మనిషి జీవితాంతం తోడుంటాడని నమ్మి పెళ్లి చేసుకుంటే.. ఇంతలా మోసం చేశాడా అని రోధించాను. చివరకు తన ఎఫైర్స్ కోసం నన్ను నా పిల్లలను చంపాలని చూశాడు. ఆ క్షణం ఆలోచించాను. నేను ఆత్మహత్య చేసుకుంటే తను ఇంకో పెళ్లి చేసుకుంటాడు కానీ నా పిల్లలు ఆగమైపోతారని ఆలోచించాను.

అందుకే క్షణం ఆలస్యం చేయకుండా ఆ రాక్షసుని చెర నుంచి తప్పించుకొని నాన్న ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. అక్కడ ఇద్దరం కన్నీరు పెట్టుకున్నాం. ఏం మాట్లాడాలో కూడా మాటలు రాలేదు. కుదుట పడిన తర్వాత నాన్నకు జరిగిన విషయమంతా చెప్పాను. నన్ను నా పిల్లలను ఆదరించాడు. విడాకులు కావాలని అప్లై చేశాను.

నాకు 18 సంవత్సరాల వయస్సులో పెళ్లి అయ్యింది. ప్రస్తుతం నాకు 25 సంవత్సరాలు. గతంలో ఆగిపోయిన నా చదువును తిరిగి కొనసాగించాలని నాన్న ప్రోత్సహించాడు. దీంతో దూర విద్యలో ఫీజు కట్టాను. చిన్న వయస్సు కావడంతో ఒంటరిగా ఉండడం మంచిది కాదని మళ్లీ పెళ్లి చేసుకోవాలని నాన్న కోరాడు. దీంతో నేను పెళ్లి వద్దని, ఏదైనా పని చేస్తూ బతుకుతానని చెప్పాను.

ఓ ప్రైవేటు ఆఫీసులో కాంట్రాక్టు వర్కులో జాయిన్ అయ్యాను. నేను పెళ్లి అయిన ఆమెలాగా కాకుండా సాధారణంగానే ఆఫీసుకు వెళ్తాను. అక్కడ నన్ను ఓ అబ్బాయి ఇష్టపడ్డాడు. నాకు ఐ లవ్ యూ అని కూడా చెప్పాడు. దీంతో నేను నువ్వు నా స్నేహితుడివి మాత్రమే అని అతనికి చెప్పాను. అతనికి ఇంకా వివాహం కాలేదు. చాలా మంచివాడు.

నాకు పెళ్లయి విడాకుల వరకు వెళ్లానన్న విషయం అతనికి ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. నిజం చెబితే అతను నాతో కనీసం ఫ్రెండ్ షిప్ కూడా చేస్తాడో లేదో తెలియడం లేదు. అతని ఫ్రెండ్ షిప్ మాత్రం జీవితాంతం ఉండాలని అనుకుంటున్నాను. అతని ప్రేమకు ఓకే చెప్పి మోసం చేసేదాన్ని కాదు. నా ప్రవర్తన మాత్రం చెడ్డది కాదండి.

ఒంటరిగా ఉన్న మహిళ ఎవరితో మాట్లాడినా కూడా సంబంధం కట్టే రోజులివి. అతని నుంచి స్నేహం ఎందుకు కోరుకుంటున్నానంటే అతని వ్యక్తిత్వం నచ్చి.. ఆపద సమయంలో అండగా ఉంటాడనే భరోసా కోసం మాత్రమే. ఇప్పటికే ఒక మగాడి వేధింపుల వల్ల జీవితం పైనే విరక్తి చెందాను. ఇప్పుడు అతనికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. చెప్తే ఫ్రెండ్ షిప్ చేస్తాడో లేదో.. చెప్పకుంటే నన్ను ప్రేమించి తాను మోసపోతాడని భయం. మీరే ఏదైనా ఒక సలహా ఇస్తారని అనుకుంటున్నాను.

ఫ్రెండ్స్ ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమించిన వాడు మంచివాడా కాదా అనేది కూడా తెలుసుకోవాలి. పెద్దల మాటను కూడా గౌరవించాలి. నా విషయంలో ఇలా జరిగిందని అందరి ప్రేమికుల విషయంలో జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ ప్రేమ ద్వారా మోసం చేయాలనుకునేవారు మాత్రం ప్రేమించకుండా ఉండడం ఉత్తమం. మరోకరి జీవితంతో ఆడుకోవద్దు. అది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే. నా జీవితం ఇప్పుడు అటు ఇటు కాకుండా సందిగ్ధంలో ఉంది. మీరే నాకు సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్...

ఇట్లు.. మీ ప్రీతి..


"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

గమనిక.. వారానికి ఒక కథను మాత్రమే ప్రచురిస్తాం. దీనిని లోకల్ యాప్ ట్రెండింగ్ కేటగిరిలో చూసుకోవచ్చు.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.