స్వాతి..నీ నిర్ణయం పైనే నా ఉత్కంఠ

241533చూసినవారు
స్వాతి..నీ నిర్ణయం పైనే నా ఉత్కంఠ
మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా. నా పేరు నాని (పేరు మార్చాం.) నేను ఓ ప్రముఖ కాలేజిలో డిగ్రీ చేరాను. డిగ్రీ మొదటి సంవత్సరం అంతా మామూలుగానే గడిచిపోయింది. నాకు అబ్బాయిలతోనే పరిచయం ఉండేది. మా క్లాస్ మేట్స్ అమ్మాయిలతో కూడా సరిగా మాట్లాడేవాన్ని కాదు. డిగ్రీ రెండో సంవత్సరంలో స్వాతిని (పేరు మార్చాం.) చూశాను. తను మా క్లాసే అన్న విషయం నాకు అప్పటి వరకు తెలియదు. చాలా అమాయత్వపు ముఖం. కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడకపోయేది. తనను చూసిన వెంటనే తన పైకి నా మనస్సు మళ్లింది. రోజు తనని చూసేందుకు ముందుగానే కాలేజికి వచ్చేవాడిని.

ఒక్కరోజు స్వాతి కాలేజికి రాకపోతే నా మనస్సంతా గాయి గాయి అయ్యేది. ఎలాగైనా తనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఓ రోజు తను కాలేజికి వస్తుండగా కాలేజి గేటు దగ్గర మాట కలిపాను. హాయ్ అండి నా పేరు నాని. మీ క్లాసే అని అన్నాను. తనకు నేను పరిచయం లేకపోవడంతో కాస్త కంగారు పడింది. హాయ్ అని సైలెన్స్ అయ్యింది. నేను మాట్లాడే ప్రయత్నం చేసినా తను మాట్లాడలేదు. దీంతో నేను కూడా సైలెన్స్ అయ్యి క్లాస్ రూంకి వెళ్లాను.

తర్వాత తన గురించి ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. వారు ముగ్గురు అక్కాచెల్లెల్లు. వారిది మామూలు మధ్య తరగతి కుటుంబం అక్క పెళ్లి అయ్యింది. తను వాళ్ల అక్క వాళ్ల ఇంట్లో ఉంటూ బట్టల షాపులో ఉంటుంది. వాళ్ల అక్క వాళ్లకు బట్టల షాపు ఉంది. రోజు సాయంత్రం 4 గంటలకు కాలేజి అయిపోగానే స్వాతి బట్టల షాపుకు వెళ్లి రాత్రి 10 గంటల వరకు పని చేస్తదని తెలుసుకున్నాను. ఓ వైపు చదువుతూనే పని చేస్తుంది.

స్వాతి క్లాస్ లో ఫస్టు ర్యాంకు వచ్చేది. చదువు తప్ప ఇంకేం ఆలోచన ఉండేది కాదు. చాలా మంచి మనస్తత్వం. స్వాతితో మరికొన్ని సార్లు మాట్లాడే ప్రయత్నం చేశాను. అప్పుడు నార్మల్ గా మాట్లాడింది. ఎక్కువగా చదువుకు సంబంధించిన అంశాలే తనతో మాట్లాడేవాన్ని. అలా మేం ఫ్రెండ్స్ అయ్యాం. స్వాతి దగ్గర ఫోన్ లేదు. దీంతో తనతో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదు. అలా నార్మల్ గానే సెకండియర్ అయిపోయింది.

డిగ్రీ ఫైనలియర్ కూడా నార్మల్ గా సాగుతున్న సమయాన అంతా కోచింగ్ ల పై దృష్టి పెట్టారు. పీజీ ఏం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేషన్ వంటి వాటి పై ఎవరి బిజిలో వారున్నారు. ఒకటే క్లాస్ రూం అయినా డిగ్రీ కదా.. త్వరగానే ఇంటికి వెళ్లిపోయేవారం. స్వాతితో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదు. ఓ సారి పరీక్షల సమయాన సబ్జెక్ట్ లో డౌట్ ఉందన్న వంకతో తన వద్దకు వెళ్లాను. అప్పుడు స్వాతితో మాట్లాడాను. ఎన్ని రోజులైనా సరే ప్రభుత్వ ఉద్యోగమే నా లక్ష్యం అని చెప్పింది. తమది పేద కుటుంబమని.. ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నానని తన చరిత్ర అంతా చెప్పింది. తను జీవితం గురించి ఆలోచిస్తుంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పడం భావ్యం కాదని వెనక్కి తగ్గాను. అలా మా డిగ్రీ పూర్తయ్యింది.

ఆ తర్వాత సెలవులు..పీజీ పరీక్షలు రాసి ఎవరి చదువులో వారిమి మునిగిపోయాం. నేను ఎంబీఏ కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ స్వాతి నల్లగొండలోనే పీజీ చేరింది. ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటూ, పీజీ చేస్తూ, బట్టల షాపులో పని చేసేది. ఓ ఫ్రెండ్ ద్వారా స్వాతి ఫోన్ తీసుకున్నాను. దైర్యం చేసి ఫోన్ చేసి మాట్లాడాను. మామూలుగా మాట్లాడింది. నన్ను కూడా కోచింగ్ తీసుకోమని ప్రోత్సహించింది. కానీ నా పరిస్థితులు వేరు. సరేనని చెప్పా. కానీ స్వాతి నువ్వంటే నాకిష్టం అని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆమె అక్కడ.. నేను ఇక్కడ.. అలా కాలం గడిచింది.

స్వాతి హైదరాబాద్ కు కూడా వచ్చి ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంది. ఆ తర్వాత తాను రాసిన రెండు పరీక్షల్లో కూడా సెలక్ట్ కాలేదు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి దైర్యంగా మాటలు చెప్పేవాన్ని. తర్వాత వస్తుందని అనే వాడిని. తనకు మాట సాయం తప్పా ఏ విధమైన సాయం చేయలేకపోయాను. స్వాతి పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చివరికి స్వాతి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. నేను ఓ కంపెనీలో మంచి స్థాయిలో ఉన్నాను.

కానీ ఇప్పుడు చెబితే స్వాతి ఏమనుకుంటుందో, ఆమోదించకుంటే పరిస్థితి ఏంది అన్న అనుమానాలు నా మైండ్ లో తిరుగుతున్నాయి. జాబ్ వచ్చాక చెబుతున్నావంటే జాబ్ ను చూశా అని కూడా అనుకోవచ్చని ఆలోచిస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా తను నన్ను ఓ స్నేహితుడిగా చూసింది. ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెబితే ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. నేను స్వాతికి నా ప్రేమను ఎలా చెప్పాలో తెలియడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. స్వాతికి చెబితే ఏం సమాధానమిస్తుందోనని ఉత్కంఠగా ఉంది.

మీ మిత్రుడు..నాని

"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

గమనిక.. వారానికి ఒక కథను మాత్రమే ప్రచురిస్తాం. దీనిని లోకల్ యాప్ ట్రెండింగ్ కేటగిరిలో చూసుకోవచ్చు.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.