వారి ప్రేమ గెలవలేదు..కానీ వారు గెలిచారు

213288చూసినవారు
వారి ప్రేమ గెలవలేదు..కానీ వారు గెలిచారు
నా పేరు రఘు. మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. నేను పీజీ చదువుతున్న రోజలవి. ఓ ఫంక్షన్ కోసం మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను. అక్కడ నాకు మరదలు వరసయ్యే సునీతను చూశాను. సునీతను చూడగానే నా మనస్సు గాల్లో తేలిపోయింది. గుండ్రటి ముఖం, చూడచక్కని రూపు. ఫస్టు సారి చూడగానే ఆమెకు ఫిదా అయిపోయాను. అప్పటి వరకు తనను చూడలేదు.

ఇంతలో మా చుట్టాల అబ్బాయి ద్వారా సునీత వివరాలు తెలుసుకున్నాను. అప్పటి వరకు సునీత మరదలు వరుస అవుతుందని తెలియదు. మరదలు వరుస అని తెలియగానే ఎగిరి గంతేశాను. ఆ ఫంక్షన్లో తనతో మాట్లాడాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు. తను డిగ్రీ చదువుతుందని తెలుసుకున్నాను.

ఓ రోజు తను చదువుతున్న కాలేజి దగ్గరికి వెళ్లాను. దూరం నుంచి తనను చూశాను. తనతో మాట్లాడే ప్రయత్నం చేశాను. కానీ దైర్యం కుదరలేదు. దీంతో వెనక్కి వచ్చేశాను. సంవత్సరానికి ఒక్కసారి కూడా మా అమ్మమ్మ ఇంటికి వెళ్లని నేను సునీతను చూశాక 10 రోజులకొకసారి ఏదో వంకతో అమ్మమ్మ ఇంటికి వెళ్లాను. అక్కడ ఉన్న స్నేహితుని ద్వారా సునీతతో మాట్లాడాలని ప్లాన్ వేశాను.

ఆదివారం రోజున సునీత ఒక్కతే ఇంట్లో ఉంటుందని, అంతా పనికి వెళుతారని ఫ్రెండ్ చెప్పాడు. నేను అమ్మమ్మ ఇంటికి వచ్చాను. సునీత వాళ్ల నాన్నతో మాట్లాడాలనే వంకతో వారింటికి వెళ్లాను. ఇంట్లో సునీత ఒక్కతే ఉంది. నన్ను గుర్తు పట్టారా అంటూ పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత ఆ మాట ఈ మాట కలిపి 10 నిమిషాలు మాట్లాడాను. బంధువులం కావడంతో సునీత కూర్చోమని కూర్చి ఇచ్చి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అలా సునీతతో ఓ అరగంటపాటు చదువు, వ్యవసాయ పనుల విషయం మాట్లాడి బయటికి వచ్చేశాను.

ఆ తర్వాతి రోజు సునీత కాలేజి దగ్గరికి వెళ్లాను. సునీత కాలేజి నుంచి ఇంటికి వెళుతుండగా తనతో మాట కలిపి మాట్లాడాను. చుట్టూ ఫ్రెండ్స్ ఉండడంతో సునీత ఇబ్బంది పడింది. తన ఇబ్బందిని గమనించి నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అసలు నేను సునీతను చూడకుండా ఉండలేకపోయాను. ఏం చేసినా ఎటు చూసినా తనే గుర్తు వస్తుంది.

మళ్లీ ఆ తర్వాతి రోజు కూడా సునీత కాలేజికి వెళ్లాను. సునీత ఒక్కతే నడుచుకుంటూ వస్తుండగా ఎదురెళ్లాను. మళ్లీ మాట్లాడే ప్రయత్నం చేశాను. సునీతకు సీన్ అర్ధమైంది. వెంటనే ఎందుకు నా వెంట పడుతున్నావంటూ నిలదీసింది. నేను సమాధానం చెప్పడానికి భయపడ్డాను. కానీ సునీతకు అర్దం కావడంతో ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాను. నువ్వంటే ఇష్టం పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. సునీత కోపంగా చూసి ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుద్ది అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. నేను బాధగా వెనుతిరిగాను.

సునీత ఇంట్ల చెబుతుందా..పంచాయతీ పెడుతారా అని భయపడుకుంటూ ఆ రోజు పడుకున్నాను. ఓ రెండు రోజుల పాటు సునీతను చూడకపోవడమే మంచిదని అనుకున్నాను. వారం గడిచింది. పరిస్థితులన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఓ రోజు మళ్లీ సునీత కాలేజి దగ్గరికి వెళ్లాను. అక్కడికి నేను వచ్చిన విషయం సునీత గమనించి నేరుగా నా దగ్గరికి వచ్చింది. దైర్యం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు అంటూ సెటైర్లు వేసింది. సునీత మాటల్లో నేనంటే తనకు ఇష్టమని అర్దమైంది. కాసేపు మాట్లాడాక తన ఫోన్ నంబర్ తీసుకున్నాను.

అలా మెసేజ్ లు, ఫోన్లు చేసుకున్నాం. కలిసి గుడికి వెళ్లాం, సినిమాలకు పోయాం, బేకరీలకు వెళ్లాం. చదువును నిర్లక్ష్యం చేయలేదు. జీవితంలో ఎలా ఉండాలని ప్లాన్ వేసుకున్నాం. ఇంతలో నాకు సునీత ఊరిలోనే మరదలు వరుసయ్యే వేరే అమ్మాయి తల్లిదండ్రులు సంబంధం కోసం వచ్చారు. నాకు ఏం చేయాలో చెప్పని పరిస్థితి. విషయం సునీతకు తెలిసింది. తను ఏడుపు..చచ్చిపోతానని చెప్పింది. నాకు సంబంధం వచ్చిన వారు కూడా దగ్గర కావడంతో తల్లిదండ్రులు వారికి మాటిచ్చారు. నేను అయోమయానికి గురయ్యాను.

సునీత ఏడుస్తూ ఉండడం, అన్నం తినకపోవడంతో వాళ్ల వదినకు అనుమానం వచ్చి అడిగితే సునీత బాధలో విషయం అంతా చెప్పింది. వారి వదిన మా తల్లిదండ్రులకు చెప్పింది. ఇంతలో నాకు సంబంధానికి వచ్చిన వారు ముహుర్తపు ఏర్పాట్ల గురించి అడుగుతున్నారు. ఇది జరుగుతుండగానే విషయం ఆ నోట ఈ నోట తెలిసి అందరికి తెలిసింది. సంబంధం వచ్చిన వారు పంచాయతీ పెట్టుకొని వెళ్లిపోయారు. సునీత వాళ్ల ఊరు, వాళ్ల ఊరు ఒకటే కావడంతో సునీతను అనరాని మాటలు అన్నారు. వారింటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారు. సునీతను ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు కొట్టారు. నా ఇంట్లో నా తల్లిదండ్రులు నన్ను తిట్టారు. అంతా ఆగమాగం..అయోమయం. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది.

ఎలాగూ బజారున పడింది కాబట్టి మా తల్లిదండ్రులు, సునీత తల్లిదండ్రులు మాకు పెళ్లి చేస్తారనుకున్నాం. కానీ వారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. పురుగుల మందు డబ్బాలు దగ్గర పెట్టుకొని బెదిరించారు. మీరు పెళ్లి చేసుకుంటే చస్తామన్నారు. మా నాన్న నాకు సంబంధం వచ్చిన వారింటికి వెళ్లి క్షమాపణ చెప్పి అమ్మాయిని ఇవ్వాలని అడిగాడు. వాళ్లు నిరాకరించారు. ఇంతలో సునీతకు తన తల్లిదండ్రులు సంబంధం చూశారు. ఇంత ఇబ్బందుల్లో కూడా సునీత నన్ను కలిసే ప్రయత్నం చేసింది.

ఎన్నో ప్రయత్నాల తర్వాత స్నేహితుల సాయంతో ఓ చోట ఇద్దరం ఎట్టకేలకు కలుసుకున్నాం. ఇద్దరం కన్నీరు పెట్టుకున్నాం. ప్రేమించుకున్నాం..కానీ కలిసి జీవించే అదృష్టం లేదని నిర్ణయించుకున్నాం. పరువు పోయింది… తల్లిదండ్రులు చస్తామంటున్నారు. ఇంత జరిగినా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండలేమనుకున్నాం. ఎవరి దారిన వారు బతకాలనుకున్నాం. బాధాతప్త హృదయంతో అక్కడి నుంచి కదిలాం. గుండెల నిండా బాధ పెట్టుకొని వీడ్కోలు తీసుకున్నాం.

ఒక నెల రోజుల పాటు ఇద్దరం మనుషులం కాలేదు. ఒకరికి ఒకరం అసలు కాంటాక్టే లేం. ఇంతలో సునీతకు సంబంధం కుదిరింది. విషయం తెలుసుకున్న నేను ఇక్కడ ఉంటే తట్టుకోవడం కష్టమని హైదరాబాద్ వెళ్లిపోయాను. సునీతకు పెళ్లి అయ్యింది. ఆమెకు పెళ్లి అయిన నెలకు నాకు కూడా పెళ్లి అయ్యింది. ఈ సమయంలో నా బాధ వర్ణాణాతీతం. జరిగింది జరిగిపోయింది. మేం ప్రేమించుకున్నాం కానీ ఎటువంటి తప్పు చేయలేదు.

నా జీవితంలోకి వచ్చిన అమ్మాయికి మంచి జీవితానివ్వాలనుకున్నాను. క్రమక్రమంగా సునీతను మర్చిపోయాను. సునీత కూడా తన భర్తతో హ్యాపీగా ఉందని తెలుసుకున్నాను. ప్రస్తుతం నాకు ఇద్దరు పిల్లలు. నాకు విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నా భార్య పిల్లలతో సంతోషంగా బతుకుతున్నాను. సునీత భర్త ముందుగా వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత వ్యాపారం పెట్టుకుని ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు.

దాదాపు 8 సంవత్సరాల తర్వాత మేం ఒక ఫంక్షన్ లో ఎదురుపడ్డాం. ఆమెను చూడగానే నా కంట్లో కన్నీళ్లు.కానీ వెంటనే తేరుకున్నాను. బాగోగులు తెలుసుకున్నాం. జీవితాల గురించి చర్చించుకున్నాం. ఆ తర్వాత ఎవరి దారినా వారిమి వెళ్లిపోయాం. బంధువులమే కావడంతో అప్పుడప్పుడు కలుస్తుంటాం. కానీ పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చినా కాలం దానిని చెరిపేస్తుంది కావున ఆ నాడు ఉన్న నొప్పి నాకు ఈనాడు లేదు. ఎవరి జీవితాలు వారిమి సంతోషంగా గడుపుతున్నాం.

ఫ్రెండ్స్.. నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే.. ప్రేమ కొందరికే సంతోషానిస్తుంది. కానీ ఎందరికో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ప్రేమ విఫలమైందని ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ప్రేమికురాలి మీద దాడులకు దిగడం సరైంది కాదు. ప్రేమే జీవితం కాదు. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రేమికురాలు దక్కనంత మాత్రాన మనం జీవితం కోల్పోయినట్టు కాదు. అందుకు నా జీవితమే ఉదాహరణ. గాఢంగా ప్రేమించిన అమ్మాయి దూరమైనా నా జీవితాన్ని నేను ఉన్నతంగా మలుచుకోగలిగాను. భార్య పిల్లలతో సంతోషంగా బతుకుతున్నాను.

ప్రేమ విఫలమైందని అఘాయిత్యాలకు పాల్పడకుండా, అఘాయిత్యాలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. డిప్రెషన్ లోకి వెళ్లి జీవితం నాశనం చేసుకోవద్దు. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం.. మర్చిపోవడం..కాలానుగుణంగా మారడం. ప్రేమించిన వారందరికి వాళ్లు ప్రేమించిన వారితోనే పెళ్లి కావాలంటే అసలు ఈ లోకంలో పెళ్లిలే జరగవు కదా. మీరు కూడా ఉన్నతంగా ఆలోచించి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారని కోరుకుంటున్నాను. "మా ప్రేమ గెలవలేదు కానీ మేం జీవితంలో గెలిచాం." ఉన్నతంగా బతుకుతున్నాం.

ఇట్లు.. మీ సోదరుడు రఘు

"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

గమనిక.. వారానికి ఒక కథను మాత్రమే ప్రచురిస్తాం. దీనిని లోకల్ యాప్ ట్రెండింగ్ కేటగిరిలో చూసుకోవచ్చు.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోండిలా: https://getlokalapp.com/share/posts/723088
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు: https://getlokalapp.com/share/posts/723863