ఇది ఒక "గోదారి బుల్లోడి” ప్రేమకథ

234550చూసినవారు
ఇది ఒక "గోదారి బుల్లోడి” ప్రేమకథ
ప్రేమ అనే పరిచయం లేని పదం నన్ను ఆ పదానికి దాసోహం చేసింది. ఒక ఊరుని కాకుండా, ఈ లోకాన్ని కాకుండా ఎక్కడో ఉన్న వ్యక్తి కోసం పరితపించడం కేవలం ప్రేమ అనే రెండు అక్షరాలకు మాత్రమే సాధ్యం. ఎందుకు అంటే దీనికి ముగింపు ఉండదు కాబట్టి. అది మనస్సును వీడి పోలేదు కాబట్టి.

నా పేరు కళ్యాణ్. మాది తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీరంగపట్నం గ్రామం. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న రోజులవి. నాకు కాలేజీ, ఇల్లు, గ్రౌండ్ తప్ప మరేమీ తెలియదు. అందుకేనేమో దేవుడు కొత్త పరిచయాలను కలుపుతాడు. కాలేజీకి వెళ్తుండేవాణ్ణి గానీ ఎందుకు వెళ్తున్నానో ఎందుకు వస్తున్నానో తెలియని నాకు ఇంటికి వచ్చే సమయంలో ఆర్టీసీ బస్సులో పెద్ద కళ్లతో ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయిలను చూసినప్పుడు చాలా మంది కళ్లకి నచ్చుతారు. కానీ నాకు మాత్రం ఆ అమ్మాయిని చూడగానే మనసుకు నచ్చింది. వెంటనే ఇంటికి వచ్చాక అమ్మా నాకు ఒక అమ్మాయి నచ్చింది. నేను తననే పెళ్లి చేసుకుంటా అని మా అమ్మతో చెప్పాను.

ఒరేయ్ ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఊరూ తెలియదు..పేరు తెలియదు. అడ్రస్సూ తెలియదు మరి ఎలా అంది. రోజులు గడుస్తూ వారాలవుతున్నాయి. వారాలు నెలలవుతున్నాయి. కానీ ఆ అమ్మాయి మాత్రం కనుపాపను వదిలి పోనంటుంది. తనను మళ్లీ 3 నెలల తర్వాత ఆర్టీసీ బస్సులోనే చూశా. పట్టలేని పరవశం. ఎలా అయినా తన అడ్రస్ తెలుసుకోవాలని పట్టుదలతో వున్నా. అలానే నా ఫ్రెండ్స్ ని కనుక్కున్నా. నా టెన్త్ ఫ్రెండ్ కి ఇంటర్ ఫ్రెండ్ తను. ఒరేయ్ నువ్వు ఎలా అయినా అడ్రస్ కనుక్కోరా అంటే తన ఫేస్ బుక్ ఐడీ ఇచ్చాడు. నేను ఆతృతతో తనకి వెంటనే రిక్వెస్ట్ సెండ్ చేశా. యాక్సెప్ట్ చేయలేదు కదా బ్లాక్ చేసింది... రోజులు గడుస్తున్నాయి కానీ ఆమె నా గుండెకి భారంగా మారింది.

అక్కడ కనిపించిన నా ఫ్రెండ్ ని వదిలే వాన్ని కాదు.. రేయ్ నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నారా... తనకి చెప్పి యాక్సెప్ట్ చేయమంటా అంటూ తనకి మెసేజ్ చేశాడు. వెంటనే యాక్సెప్ట్ చేసింది. నా ఆనందానికి హద్దుల్లేవు. అప్పుడు స్టార్ట్ అయ్యింది మా జర్నీ... రోజూ మెసేజస్ చేసేవాడిని. అవి కాస్తా ఫోన్ కాల్స్ గా మారాయి. ఆ నిమిషం వర్షాకాలంలో తొలకరి చినుకులా నా నుదుటన చేరింది. ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ లాగే మూవ్ అవుతున్నాం. ఐనా ఎందుకో తెలియని భయం ఆ అమ్మాయికి అడిక్ట్ అవుతానేమో అన్న సందేహం. నా మనసుని బాధించేది. తనకి ప్రపోజ్ చేద్దామని ఫిక్సయ్యా.

నేను చెప్తే... మళ్లీ ఎక్కడ దూరం అవుతుందో అని అదోక భయం. తన మీద ఒక కవిత రాశా. గోదావరి అలలా .... సముద్రపు కెరటంలా ...సున్నితమైన నా మనసుని తన మాటలతో గందరగోళం చేసింది. నేను ఏమైతే అనుకున్నానో అలానే జరిగింది. తనకు కూడా నా మీద అమితమైన ప్రేమ ఉందని తన మాటలలో అర్ధమైంది. నాకు తనపై చచ్చేంత ప్రేమ వుంది. నా ప్రేమ కవితల రూపంలో తనకి వ్యక్తపరిచాను. ఆమె కూడా నా మీద ఇష్టాన్ని తెలియజేసింది. దూరం కాస్తా దగ్గర అయ్యింది. తాను లేకపోతే... నేను లేనేమో అనేలా నేను తయారయ్యా. ఫస్ట్ టైం తను బయటికి తీసుకువెళ్లమంది. గోదారోళ్లం కదా.. కాకినాడ బీచ్ కి తీసుకువెళ్లాను. అప్పటికీ తెలియని భయం.. నా వెనుక ఒక అమ్మాయి కూర్చుని ఉంది. తనకి నా మీద ఎంత నమ్మకం ఉంటే ... నెల రోజుల పరిచయానికి నాతో బయటికి వస్తుంది. మదిలో ఒక తెలియని అనుభూతి.

చివరికి కాకినాడ బీచ్ కి చేరుకున్నాం. తనతో మాట్లాడాలి అని ఉంది కానీ ఎలా. ఎలానో ధైర్యం చేసి నాలో ఉన్న భావాలను తనతో పంచుకున్నా. అప్పుడు తన మాటలలో దేవుడు మన ఇద్దరిని దగ్గర చేయడానికి ఒక కారణం వుండే ఉంటుందని చెప్పింది. నేను ఎప్పుడూ గుడికి పోను అటువంటిది గుడికి వెళ్లి దేవుడా. ఇంత మంచి అమ్మాయిని పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అంటూ తన ఊహలలో బ్రతుకుతూ ఉండేవాడిని. అలానే తరచూ కలుస్తూ మాట్లాడుకునే వాళ్ళం.

ఇలా ఉండగా ఒక రోజున కాటన్ మ్యూజియంకి వెళ్ళాం. అక్కడ తనతో ఉన్నప్పుడే నా మనసులో చిన్న సందేహం. నన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో అని. ధైర్యం చేసి అడిగేశా.. ఆ పెయిన్ అక్కడితోనే పోవాలి అని. అప్పుడు తాను ఏడ్చింది. ఏం నీకు నా మీద నమ్మకం లేదా అని. అదేం కాదు... నువ్వు మాత్రం ఎస్ ఆర్ నో చెప్పాల్సిందే అని పట్టు పట్టా. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో... అంటూ ఏడుస్తూ కూర్చుంది. నిన్ను నేను తీస్కోచ్చా కాబట్టి ఇంట్లో దించి వెళ్ళిపోతా అంటూ సమాధానం ఇచ్చా. ఆ తర్వాత తనని ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయా. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తనతో మాట్లాడకపోతే చనిపోతానేమో అనేలా తయారయ్యా నేను.

ఇంతలో కాలేజీ సెమిస్టర్ ముగిసింది. తనను చూడలేకుండా ఉండలేను. అప్పుడే నా పుట్టినరోజు దగ్గరికి వచ్చింది నువ్వ్వు వస్తేనే నేను సెలెబ్రేట్ చేసుకంటా అంటూ మొండిగా అడిగా. తను నా మాట కాదనలేక వచ్చింది. తనతో గడిపిన ఆ రోజు నాకు జీవితంలో మరచిపోలేని రోజు. ఇంతకీ చెప్పడం మరిచిపోయా. నా పేరు మమ్ము .. తన పేరు చిన్నూ. మేము ఇద్దరం ఇలానే పిలుచుకునే వాళ్ళం. తరువాతి నెలలో తన బర్త్ డే. కోట్స్ తో నెల మొత్తం విష్ చేసేవాడిని . తన బర్త్ డేకి రెండు రోజుల ముందు రాజీ వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది.

తను మాట్లాడకపోతే నేను ఉండలేనని ఫోన్ చేసి మమ్ము నువ్వు తినేసి పడుకో అంటూ కంగారుగా ఫోన్ పెట్టేసింది. నాకు తను క్రిటికల్ కండిషన్ లో ఉందని అర్ధం అయ్యింది. తరువాత రోజు ఫోన్ చేసి మమ్ము నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది. నువ్వు కంగారు పడతావని చెప్పలేదు అని ఏడ్చింది. తను ఏడిస్తే నాకు అస్సలు నచ్చదు. వెంటనే నేను హాస్పిటల్ కు వెళ్ళాను. సుబ్బారావు అంకుల్ ని చూద్దామని... మమ్ము నువ్వు చెప్పకుండా వచ్చావ్ ... అమ్మ వాళ్ళు ఇక్కడే వున్నారు ... మళ్లీ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి పంపించేసింది. నేను అంకుల్ కోసం మోకాళ్ళ ప్రదక్షిణాలు చేసి నువ్వే ఆయనని కాపాడాలి అంటూ ఏడ్చేవాడిని. ఇంతలో వాళ్ల బాబాయి మమ్మల్ని చూసేశారు. కానీ మా ఇద్దరికీ తెలియదు. అప్పుడు తనకి ఇంటికి వెళ్లాక వార్నింగ్ ఇచ్చారు.

కానీ తాను నాకు చెప్పలేదు. ఎప్పుడూ పొద్దున్నే లేపే మెసేజస్ లేవు .. ఫోన్స్ లేవు ..ఎందుకో నాకు అర్ధం కాలేదు.. అప్పటి నుంచి నో కాలేజీ నో ఫుడ్ .. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఈ మధ్యలోనే మా ఊరిలో ఉన్న వాళ్ల బాబాయ్ మా ఇద్దరి మీద కల్పించి వాళ్ళ ఇంట్లో చెప్పాడు. నేను ఇక్కడ ఉంటే తనకి ప్రాబ్లెమ్ అవుతుంది అని చెప్పి బెంగుళూరుకి వెళ్లి జాబ్ లో జాయిన్ అయ్యా. అలానే తనపై ప్రేమను ఇంకా పెంచుకున్నా. దాదాపు 6 నెలలు తరువాత ఇంటికి వెళ్ళాను. మళ్లీ పంచాయితీ పెట్టారు. కుర్రోన్ని కదా ఉడుకు రక్తం ఆగలేక నోరు జారాను. వాళ్ల బాబాయ్ వచ్చి మాట ఇచ్చారు. నువ్వు కరెక్ట్ గా సెటిల్ అయ్యి అడుగు.. అప్పుడు మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదన్నాడు. ఆ నమ్మకంతోనే జాబ్ చేస్తూ తన ఊహల్లోనే బ్రతుకుతున్నా... తను లేకపోతే నా జీవితంలో ఏ రంగులూ ఉండేవి కాదేమో బహుశా... నీ కోసం కనులకి సైతం చిరాకు తెప్పించేలా ఎదురుచూస్తున్నా రాజీ…

ఇట్లు…. నీ మమ్ము ....

చెప్పాలని ఉంది సిరీస్ ప్రతి ఆదివారం మధ్యాహ్నాం 12 గంటలకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అందిస్తున్నాం.

"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

24 ఏళ్లకే కలెక్టర్: https://getlokalapp.com/share/posts/804056