విషాదంగా మారిన వాణి, వెంకట్ ల జీవితం

289439చూసినవారు
విషాదంగా మారిన వాణి, వెంకట్ ల జీవితం
నా పేరు వాణి (పేరు మార్చాం). మాది నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామం. మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఇంటర్ లో ఉండగానే మా నాన్న పెళ్లి సంబంధాలు చూశాడు. నేను ఆ రోజు కాలేజ్ కు పోయి వచ్చాను. అప్పుడే మా పక్క ఊరికి చెందిన వెంకట్ (పేరు మార్చాం) నన్ను చూడడానికి వచ్చాడు. నాన్న తీసుకువచ్చిన సంబంధం కావడంతో నాకు ఇష్టం లేకున్నా పెళ్లి చూపులకు ఒప్పుకొని కూర్చున్నాను. వెంకట్ వెళ్లిపోయాక నాన్నతో గొడవపడ్డాను. నాకు ఇప్పుడే పెళ్లి వద్దు నాన్న, నేను చదువుకుంటానని చెప్పాను. దానికి నాన్న మంచి సంబంధం అని ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.

నేను వెంకట్ కు బాగా నచ్చాను. వాళ్ల బంధువులను పంపి పెళ్లి ముహుర్తాల గురించి అడిగించాడు. ఇప్పుడు మా బిడ్డ పెళ్లి వద్దంటుందని చెప్పి పంపించాడు. అయినా వాళ్లు ఊకోలేదు. వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చారు. చివరకు వెంకట్ నా కాలేజి దగ్గరికి వచ్చి నేను నచ్చలేదా అంటూ ప్రశ్నలు వేశాడు. నేను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను. వెంకట్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. వ్యవసాయం అంటే ఆయనకు పిచ్చి. వ్యవసాయ నేపథ్య కుటుంబం వారిది. వెంకట్ డిగ్రీ చదివినా వ్యవసాయం మీద ప్రేమతో వ్యవసాయమే చేసేవాడు.

చివరకు మరోసారి వెంకట్ నేరుగా మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడాడు. నాకు ఒక్క రూపాయి కట్నం వద్దండి… వాణి నచ్చింది పెళ్లి చేయండి. అని అడిగాడు. అప్పుడు అతని దైర్యం నాకు నచ్చింది. అంతే కాదు వెంకట్ వారిది మంచి కుటుంబం కావడంతో ఇటువంటి సంబంధం మళ్లీ వస్తుందో రాదోనని అమ్మా నాన్న టెన్షన్ పడ్డారు. మా ఫ్రెండ్స్ తో, మా బంధువులతో నాకు నచ్చచెప్పి ఒప్పించారు. అలా మా పెళ్లి ముహుర్తం కుదిరి 25 సంవత్సరాల క్రితం ఒక్కటయ్యాం. అంతా పెళ్లికి ముందు ప్రేమించుకుంటారు. కానీ మేం పెళ్లి తర్వాత ప్రేమించుకున్నాం. వెంకట్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఏనాడు ఒక్క మాట కూడా తిట్టలేదు.

వెంకట్ ఎంత వ్యవసాయం పని ఉన్నా కూడా నన్ను బావి దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అతనే చూసుకునేవాడు. కూలీలతోనే పనులు చేయించేవాడు. అలా మూడు పువ్వులు ఆరు కాయల్లా మా కాపురం సాగిపోతుంది. ఇంతలోనే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. మా పండంటి కాపురంలో వెలుగులు పూచేలా మాకు ఒక పాప, బాబు పుట్టారు. ఆనందంగా మా జీవితం సాగిపోతుంది. వెంకట్ వ్యవసాయంతో పాటు చిట్టీలు, ఫైనాన్స్ బిజినెస్ కు దిగాడు. వెంకట్ అందరిని చాలా ఈజీగా నమ్మేవాడు. మానవత్వ గుణం కలిగినవాడు. అందరిని నా వాళ్లు అని కలుపుకుపోయేవాడు. అలా మా కాపురం సాగుతుంది.

పిల్లల చదువు కోసం మేం నల్లగొండలో అద్దె ఇంట్లోకి దిగాం. వెంకట్ రోజు గ్రామానికి వెళ్లి పొలం పనులు చూసుకొని వచ్చేవాడు. వెంకట్ కు దైవభక్తి ఎక్కువే కానీ పూజ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనకపోయేది. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసేవాడు. మా పెళ్లి రోజు కూడా గుడికి వెళ్లేవారం కాదు. ఆయనకు నచ్చదు. నలుగురికి సహాయం చేయడంలో మంచి ఉంటది. గుడికి వెళ్లి దండం పెట్టి, పూజలల్లో పాల్గొంటేనే మంచి జరుగుతదా అని అనేవాడు. దేవున్ని మొక్కేవాడు కానీ పూజలల్లో మాత్రం పాల్గొనేవాడు కాదు. ఉన్నంతలో మా బతుకు మేం హ్యాపీగా బతుకుతున్నాం. ఇంతలో మేం ఆర్దికంగా కూడా మంచిగానే సెట్ అయ్యాం.

కానీ ఇదే సమయంలో మాకు పెద్ద దెబ్బ తగిలింది. వెంకట్ ఫ్రెండ్స్ ఫైనాన్సియల్ గా దెబ్బ తీశారు. ఇచ్చిన డబ్బు ఇవ్వలేదు. అలా మేం 40 లక్షలు లాస్ అయ్యాం. అడిగితే కేసు పెట్టుకోండి ఏం చేయలి.. మా దగ్గర డబ్బులు లేవన్నారు. మమ్ముల చంపండి అన్నారు. కేసు పెట్టినా మా పైసలు మాకు రాలేదు. అయినా వెంకట్ దైర్యంతో పొలాన్నే నమ్ముకొని వ్యవసాయం చేశాడు. సొంతం ఇల్లు కట్టుకొని బతుకుదామనుకున్నాం. కానీ దుర్మార్గుల వల్ల అప్పులపాలయ్యాం. వెంకట్ కు కల్లు అంటే ఇష్టం. పొలం దగ్గరికి వెళ్లి ఉదయం, సాయంత్రం కల్లు తాగేవాడు. కొన్నాళ్లకు అప్పుల బాధ నుంచి తేరుకున్నాం.

ఇంతలో వెంకట్ కు బాగా జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించాను. మామూలు జ్వరం తగ్గిపోతుందని డాక్టర్ అన్నాడు. అప్పుడు మామూలుగానే తగ్గిపోయిందనుకున్నాను. ఆ తర్వాత వారానికి వెంకట్ కళ్లలో పసిరికలు కనపడ్డాయి. దీంతో నాకు కంగారు మొదలైంది. వెంటనే డాక్టర్ తో పాటు నాటు వైద్యున్ని సంప్రదించాం. ముందుగా డాక్టర్ ఇచ్చిన మందులు వాడాం. కానీ పరిస్థితిలో మార్పు లేదు. ఆ తర్వాత నాటు వైద్యుడు ఇచ్చిన మందులు వాడాం. అతను కాస్త పత్తం చేయాలని చెప్పాడు. అంటే ఏవి పడితే అవి తినవద్దని కొన్ని కూరగాయల పేర్లు సూచించాడు.

వెంకట్ పత్తం చేస్తే బాగానే ఉండేది. ఇంటికాడ నా భయానికి మామూలుగా ఉండేవాడు. కానీ బావి దగ్గరకు పోయినప్పుడు కల్లు తాగేవాడు. కల్లు తాగవద్దని నాటు వైద్యుడు చెప్పాడు. కానీ వెంకట్ వినకుండా కల్లు తాగాడు. నేను గుర్తుపట్టి తిడితే తిట్టేవాడు. ఎప్పుడు ఒక్కమాట అననివాడు మొదటిసారిగా తిట్టాడు. దీంతో నేను బాధతో ఏం అనేదాన్ని కాదు. అదే విధంగా చేపలు, చికెన్ కూడా బయట తీసుకొని తినేవాడు. అది నాకు తెలియకుండా వ్యవహరించాడు. అలా పత్తం చేయకుండా తన ఆరోగ్యాన్ని మరింత కరాబు చేసుకున్నాడు.

ఈలోగా వెంకట్ కు కడుపునొప్పి రావడంతో మేం భయంతో హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకువచ్చాం. పరీక్షించిన డాక్టర్ పసిరికలు కడుపులో పడ్డాయి. లివర్ కు వ్యాప్తించాయని చెప్పాడు. నాకు ఏం చేయాలో తెలియక షాకయ్యాను. నా కంట నీరు ఆగలేదు. వెంకట్ కు ఏం తెలియకుండా జాగ్రత్తపడి డాక్టర్ తో మామూలుగా చెప్పించాను. ఆ తర్వాత డాక్టర్ కూడా కొన్ని పత్తం చేయాలని చెప్పాడు. ఆ తర్వాత నల్లగొండ వచ్చాం. వెంకట్ వారం రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత పొలం పనులకు వెళ్లాడు.

నేను కూడా నార్మల్ గానే ఉంటున్నాడు కదా అనుకున్నాను. కానీ వెంకట్ నోరు కట్టచేతకాక మళ్లీ కల్లు, చేపలు,చికెన్ తిన్నాడు. అలా నెల రోజుల తర్వాత మరోసారి కడుపు నొప్పితో అడ్డం పడ్డాడు. నేను మళ్లీ ఆస్పత్రికి తీసుకుపోతే లివర్ సగం ఖరాబైంది. పూర్తిగా విశ్రాంతి తీసుకొని చికిత్స చేయించుకోవాలన్నారు. నాకు ఏం తోచలేదు. ఏం ఆలోచించకుండా హైదరాబాద్ లో ఓ చిన్న రూం అద్దెకు తీసుకొని రోజు ఆస్పత్రిలో చికిత్స చేయించి రూంకి తీసుకు వచ్చేదాన్ని. మా పిల్లలు కూడా హైదరాబాద్ లోనే హస్టల్ లో ఉండేవారు. అక్కవాళ్లు కూడా ఉండేది. దీంతో అంతా వచ్చి పోతుండేవారు.

క్రమేపి వెంకట్ ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ కోలుకోలేదు. నాకు ఎందుకో గుండెలో అలజడి ప్రారంభమైంది. అయినా సరే ఎలాగైనా నా భర్తను బతికించుకోవాలని నిర్ణయించుకున్నాను. వెంకట్ కు సేవలు చేస్తూనే చికిత్స చేయిస్తున్నాను. వెంకట్ చాలా వీక్ నెస్ గా మారాడు. జ్ఞాపక శక్తి కోల్పో సాగాడు. అలా సంవత్సరం చికిత్స చేయించాను. చిన్న పిల్లడిలా వెంకట్ మారిపోయాడు. లెట్రూం, బాత్రూం అన్ని పోయినా నేనే సపర్యలు చేసేదాన్ని. అప్పుడే పుట్టిన పిల్లలు తెలివి లేకుండా ఎలా అవుతారో ఆయన అలా అయ్యాడు. లివర్ పూర్తిగా ఖరాబైంది. లివర్ చేంజ్ తప్పా మరో ఆప్షన్ లేదని డాక్టర్లు అన్నారు. రూ.20 లక్షలు ఖర్చు అవుతుందన్నారు.

నాకు ఏం చేయాలో తోచలేదు. అయినా సరే నా భర్తను బ్రతికించుకోవాలనుకున్నాను. ముందుగా అప్పుతెచ్చి ఆ తర్వాత భూమి అమ్ముదామని నిర్ణయించుకున్నాను. లివర్ కోసం ఎక్కడ ట్రై చేసినా దొరకలేదు. చివరకు మా కొడుకు లివరే సెట్ అయ్యింది. ఆపరేషన్ చేసే ముందు డాక్టర్లు 50-50 శాతం ఆశలన్నారు. దేవునిపైనే భారం వేసి ముందుకు సాగాం. ఆపరేషన్ అయ్యింది. ఓ వైపు నా భర్త బెడ్ పైన, మరో వైపు నా కొడుకు బెడ్ పైన పడి ఉన్నారు. ఎలా బతికేవాళ్లం ఎలా అయ్యింది బతుకన్ని గుండెలవిసేలా రోధించాను.

రెండు రోజుల వరకు వెంకట్ బాగానే ఉన్నాడు. మూడో రోజు ఉదయం అనూహ్యంగా హర్ట్ ఎటాక్ కు గురై చనిపోయాడు. ఆపరేషన్ జరగడంతో అతని బాడీ తట్టుకోలేకపోయిందని డాక్టర్లు తెలిపారు. నేను పిచ్చిదాన్నయిపోయాను. నా బతుకేందని తలను గోడలకు బాదుకున్నాను. లే వెంకట్..లే అంటూ రోధించాను. నా పిల్లల భవిష్యత్ ను తలచుకొని ఏం చేయాలో నాకు తోచలేదు. నా ఆర్తనాదాల మధ్యనే బంధువులు అంత్యక్రియలు చేశారు.

2 సంవత్సరాల నుంచి చిన్నపిల్లవాడిలా చూసుకున్నాను. తను నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు. భగవంతుడా నాకే ఈ తలరాత ఎందుకు రాశావయ్యా అంటూ ప్రతిరోజు ఏడ్చాను. 2 నెలలు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ తర్వాత పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి కాస్త తేరుకున్నాను. కానీ వెంకట్ ను మర్చిపోవడం నా వల్ల కావట్లేదు. అతను బతికే ఉన్నాడన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాను.

పిల్లలు హాస్టళ్లలో ఉంటున్నారు. భర్త లేని సమాజాన్ని ఈ లోకం అదో రకంగా చూస్తది. అందుకే నేను బయటికి వెళ్లడం మానేశాను. మా అమ్మ వాళ్లు హైదరాబాద్ కు నన్ను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను. వెంకట్ గుర్తులు మరువలేకున్నాను. నూరేళ్లు కలిసి బతుకుతామనుకుంటే 25 ఏళ్లకే దూరమైపోయాం. నాకు కూడా చావాలని అనిపించింది. కానీ నా పిల్లలు గుర్తు వచ్చారు. జీవితాంతం వెంకట్ గుర్తులు తలుచుకొని బతికేస్తాను. త్వరలోనే మా ఊరువెళ్లి ఇక నేను వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటున్నాను. వ్యవసాయం నా వల్ల కాకపోతే స్వయం ఉపాధి చూసుకోవాలనుకుంటున్నాను. వెంకట్ జ్ఞాపకాలతో పిల్లలే నా ప్రపంచగా బతుకుతాను. కానీ వెంకట్ నా మీద చూపిన ప్రేమను నేను మరువలేను. నా జీవితం ఇంత విషాదంగా మారుతుందనుకోలేదు.

దయచేసి అందరికి ఒక విజ్ఞప్తి. ఒక మనిషికి అనారోగ్యం ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. మీ మీద ఆశలు పెట్టుకుని కుటుంబం, భార్య, పిల్లలు ఉంటారు. ఏ భార్య అయినా తన భర్త మంచిగుండాలని కోరుకుంటుంది. తాగి జీవితాలు ఆగం చేసుకోవద్దని కోరుకుంటున్నాను. భార్య తాగవద్దని చెబితే అసహ్యించుకోకుండా ఓ సారి ఆలోచించండి. వెంకట్ పత్తం పాటిస్తే బతికేవాడు. నాలాగా ఎవరికి కావద్దని కోరుకుంటున్నాను.

ఇట్లు మీ సోదరి... వాణి


"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

గమనిక.. వారానికి ఒక కథను మాత్రమే ప్రచురిస్తాం. దీనిని లోకల్ యాప్ ట్రెండింగ్ కేటగిరిలో చూసుకోవచ్చు.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.