ఊరికోసం ఆ ఐదుగురు యువకుల కృషి

19893చూసినవారు
ఊరికోసం ఆ ఐదుగురు యువకుల కృషి
చదువుకున్న విద్యను, తెలివితేటలను ఓ ఐదుగురు యువకులు ఊరికోసం ఉపయోగించారు. కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయకుండా అందరికీ ఉపయోగపడే పని చేశారు. దోమల బెడద తీర్చి.. గ్రామస్థులు రోగాల బారిన పడకుండా చేశారు. వారే ఎం కొండూరు మండలం చీమలపాడుకు చెందిన న్యాయంపల్లి నాగరాజు, షేక్ యాసిన్, షేక్ సంధాని, మహ్మద్ సోను, మహ్మద్ బాబు. దోమల లార్వాను నాశనం చేసే మందు, దాన్ని తయారు చేసే విధానాన్ని ఫేస్‌బుక్‌లోని ఓ పోస్టింగ్‌లో చూశారు.

దీన్ని రాజమహేంద్రవరానికి చెందిన ఆజాద్‌హింద్‌ ఫౌండేషన్‌ సంస్థకు చెందిన సభ్యులు పెట్టారు. ఇది చూసిన ఆ యువకులు ఆ మందును తయారుచేసి, గ్రామంలోని కొన్ని వీధుల్లోని మురుగు కాల్వల్లో ఉపయోగించారు. దోమల బెడదను.. వదిలించారు. సామిల్‌లో కలపను కోయగా వచ్చే పొట్టుకు వాహనాల ఇంజిన్లలో వాడిన అనంతరం వచ్చే మడ్డి ఆయిల్‌ను కలిపి దీన్ని తయారు చేశారు. పొట్టులో కొద్దిగా నీళ్లు పోయడం ద్వారా ముద్దగా అవుతుంది. దీన్ని కొద్దికొద్దిగా వస్త్రాల్లో వేసి చిన్నచిన్న మూటలుగా కట్టారు. ఇలా మూటలుగా కట్టిన పొట్టును మడ్డి ఆయిల్‌లో కొంతసేపు నానబెట్టారు. తర్వాత మడ్డి ఆయిల్‌లో నానిన మూటలను దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వేశారు.

ఇలా పదిహేను అడుగులకు ఒక మూట చొప్పున వేయడంతో మడ్డి ఆయిల్‌ చుట్టు పక్కల నిల్వ ఉన్న మురుగు నీరుపైన వ్యాపించింది. తద్వారా మురుగు నీటిపై మడ్డి ఆయిల్‌ పొరలా వ్యాపించడం వల్ల లార్వా ఊపిరి ఆడకుండా మరణిస్తుందని, తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని యువకులు తెలిపారు. పాత వస్త్రంలో మూటకట్టిన పొట్టు మడ్డి ఆయిల్‌ను పీల్చుకోవడం వల్ల వెంటనే వ్యాపించకుండా నిదానంగా ప్రతి రోజు మురుగునీటిపై వ్యాపిస్తుందని వివరించారు. ఇలా దోమల నియంత్రణకు తమవంతు చొరవ చూపుతున్న యువకులు చేస్తున్న పనిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.

నోట్: మీ జిల్లాలో మీకు తెలిసిన ప్రత్యేక కథనాలను లోకల్ యాప్ ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నారా? ఐతే వెంటనే లోకల్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని.. మా ఊరి కథలలో తగిన ఫొటోలతో పోస్ట్ చేయగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్