ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ సైదాబాద్ లో జరిగింది. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం తేల్ దార్ పల్లి నక్కలగండి తండా గ్రామ పంచాయతీకి చెందిన ఓ దంపతుల 6సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసారు. దంపతులు ఇద్దరు బతుకుదెరువు కోసమని సింగరేణి కాలనీలో గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం 5గంటలకు బాలిక అదృశ్యమైంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో తాళం పగలగొట్టి చూడగా బాలిక శవమై కనిపించింది. ఆ ఇంట్లోని వ్యక్తే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు, స్థానికుల మధ్య వివాదం జరిగింది.
అనంతరం శుక్రవారం ఉదయం చంపాపేట్ రహదారిపై సేవాలాల్ బంజారా సంఘం నాయకులు, సింగరేణి కాలనీ వాసులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ పార్టీ నాయకులతో ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అనంతరం సంఘటన స్థలానికి కలెక్టర్, అడిషనల్ కమిషనర్ చేరుకొని ప్రభుత్వంతో మాట్లాడి నిందితుడిని ఉరి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.