ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంలో సీఐటీయూ ముందుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సి ఐ టి యు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి తెలిపారు. ఆదివారం రామగుండం సింగరేణి సంస్థలో పదవీ చెందుతున్న తుమ్మల రాజా రెడ్డి లోకల్ న్యూస్ తో మాట్లాడారు. తాను జీవితాంతం సీఐటీయూతోనే ఉంటానని, కార్యకర్తల సహకారంతో సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగినట్లు ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావాలు కలిగిన రాజారెడ్డి అదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పావునూరు గ్రామం, రాజారెడ్డి విద్యార్థి దశ నుండే సంఘాలలో పనిచేసానని ఆయన పేర్కొన్నారు. తాను ఉద్యోగం ప్రారంభదశలో కార్మికునికి ఏ సమస్య వచ్చినా అందరు కార్మికులు ఐక్యతతో సమ్మెలోకి వెల్లే వారని ఆయన తెలిపారు. ఒక దశలో తన తోటి కార్మికుల కోసం ఏ సమస్య అని తెలుసుకోకుండా అందరి తో పాటు సమ్మె లోకి వెళ్లి మద్దతు తెలిపే వారని ఆయన గతాన్ని గుర్తు చేశారు.
నేడు కార్మిక వర్గంలో ఆ స్ఫూర్తి తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. సింగరేణి లో ఎన్నికలు కార్మికుల హక్కులను కాలరాయడం కోసమేనని రాబోయే కాలంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యతతో లేకుంటే కార్మికులకు కార్మిక సంఘాలకు గడ్డుకాలం రానుందని ఆయన పేర్కొన్నారు. గుర్తింపు ఎన్నికలు వచ్చాక కార్మికుల హక్కులు కాల రాయబడ్డాయని, ఇది యాజమాన్యం ప్రభుత్వం చేసిన కుట్ర అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మిక సంఘాలన్నీ ఐక్యతతో కలిసికట్టుగా పోరాటం చేసినప్పుడే కార్మిక సమస్యలు పరిష్కరించబడతాయని ఆయన సూచించారు. సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి నాయకునిగా ఎదగడానికి కార్యకర్తల సహకారం తో పాటు తన సతీమణి ప్రోత్సాహం కూడా ఉందని చివరగా ఆయన పేర్కొన్నారు.