సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండల పరిధిలో గల ఇస్నాపూర్ గ్రామము లో బుధవారం నందిగామ రోడ్డు శివాలయం ఆవరణలో కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంబరాల కార్యక్రమంలో ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఒక నెలకు సరిపడా బియ్యము, కందిపప్పు, మంచి నూనె, చెక్కర, కారంపొడి, సబ్బులు, పేస్టు తదితర నిత్యవసర వస్తువులను 35 మంది తీవ్ర వైకల్య దివ్యాంగులకు ఇవ్వడంతోపాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన 13 మందికి ఒక్కొక్కరికి చార్జీలకు రూ. 500 రూపాయలు సహాయం అందించారు. అదేవిధంగా ఇస్నాపూర్ ఉప సర్పంచ్ బురిగారి శోభకృష్ణారెడ్డి కూడా 35 మంది బాధితులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 17, 500 రూ. ఆర్థిక సాయం అందించి వారి దాతృత్వం చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్పంచ్ బాలమణి కండువాతో సత్కరించారు. దివ్యాంగులకు సేవలు అందిస్తున్న టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ ని పలువురు అభినందించారు. తీవ్ర వైకల్యం ఉన్న దివ్యాంగుల ఆనందం కోసం విచ్చేసిన అతిథులు కోలాటంలో పాల్గొని ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా దివ్యాంగుల మనసును తృప్తి పరిచారు. అనంతరం దివ్యాంగులతో పాటు వచ్చిన వారందరికీ అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బురిగారిఅంజిరెడ్డి, వార్డు సభ్యులు లావణ్య నర్సింలు, భారతమ్మ, మాజీ ఎంపీటీసీ విశ్వనాథం, మాజీ వార్డు సభ్యులు హనుమంతు, బొల్లారం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయుడు పైసా సత్యం, వెంకోబా, బాపు వెంకన్న, కంచిగారి శ్రీనివాస్, ఉల కృష్ణ, కుమ్మరి రమేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.