వీర తెలంగాణ పోరు..నైజాం నవాబ్ కు ముచ్చెమటలు

27938చూసినవారు
తెలంగాణా సాయుధపోరాటాల గురించి నేటితరం వారికి అంతగా తెలియకపోవచ్చు గానీ ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలన గురించి, రజాకర్ల ఆకృత్యాల గురించి, వాటిని ఎదుర్కోవడానికి జరిగిన తెలంగాణా సాయుధ పోరాటాల గురించి తెలిసున్న వెనుకటితరం వారు నేటికీ ఆనాడు తాము అనుభవించిన కష్టాలు మరిచిపోలేమని చెబుతుంటారు. ఆనాడు తమ కళ్ళ ముందు జరిగిన దారుణ మారణకాండ, అత్యాచారాలు, అకృత్యాలు జ్ఞాపకం వస్తే బాధతో కళ్ళ నీళ్ళు పెట్టుకొంటుంటారు.

1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభ తొలిసభ. ఆ సభతో తెలంగాణ ప్రజల సంఘటిత చైతన్యం మొదలయ్యింది. తెలంగాణ ప్రజా పోరాటం మొదటి నుండీ నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగానే కాదు అంత కంటే ప్రధానంగా తెలంగాణను చెరబట్టిన దొరల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా కొనసాగింది. 1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ 11వ మహాసభ నాటికి ఆంధ్రమహాసభ ప్రధాన నాయకులందరూ కమ్యూనిస్టు ఆదర్శాలతో ప్రభావితులై కమ్యూనిస్టులుగా మారారు. ఆ విధంగా 1944 నుండి తెలంగాణ ప్రజాపోరాటం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొనసాగింది. అయితే నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన కారణాన ఆంధ్ర మహాసభ పేరుతోనే కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు కొనసాగాయి.

1946 జూలై 4న నేటి జనగామ జిల్లా కడివెండిలో విసునూరి దొరసాని జరిపిన తుపాకీ కాల్పుల్లో ఆంధ్ర మహాసభ కార్యకర్త దొడ్డి కొమురయ్య అమరుడవ్వడంతో తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ రూపం సంతరించుకున్నది. బాంచన్‌ కాల్మొక్తా అంటూ బతికిన తెలంగాణ బిడ్డలు.. బరిసెలు, బందూకులూ చేతబట్టి... దొరల రాజ్యం కూల్చడానికి ఉద్యమించారు. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో రైతాంగపోరాటం ఉధృతంగా సాగింది. దొరలు ఊర్లను విడిచి పరారయ్యిండ్రు. మూడు వేల గ్రామాలు విముక్తమై... గ్రామ రాజ్య కమిటీల ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ఏర్పడింది. దొరల కబ్జాలో ఉన్న పది లక్షల ఎకరాల భూమి పేద రైతులకు పంచబడింది. రుణ పత్రాలు రద్దయ్యాయి. వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగాయి. కుల వివక్ష, లింగ వివక్ష కట్టడి చేయబడినాయి.

తెలంగాణలో దొరల రాజ్యం కూల్చిన తెలంగాణ బిడ్డలు... దొరలకు పెద్దన్నలాంటి నిజామోడికి కూడా గోరీ కట్టడానికి సిద్ధమవుతున్నవేళ... 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. స్వతంత్ర భారతావనిలో ఢిల్లీ పీఠమెక్కిన కాంగ్రెస్‌ పెద్దలు భూస్వాములు, పెట్టుబడిదారుల పక్షం వహించడాన్ని, తెలంగాణ ప్రజలు గమనించారు. పక్కనున్న ఆంధ్ర ప్రాంతంలో (నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం) పాలన చేస్తున్న టంగుటూరి ప్రకాశం సర్కారు.. ''పబ్లిక్‌ సేఫ్టీ ఆర్డినెన్స్‌'' పేరుతో రైతు ఉద్యమాలను తీవ్రంగా అణచివేయడాన్ని భూస్వాముల కొమ్ముకాయడాన్ని చూసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షమో అర్థం చేసుకున్నారు. మరోవైపు తెలంగాణలోని భూస్వాముల ప్రతినిధులు కొండా వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి మొదలైనవారు ఢిల్లీకి చేరి తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు.
భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ తమది స్వతంత్ర రాజ్యమని, భారత్ లో విలీనం కాదలచుకాలేదని ప్రకటించాడు. దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, మానవ మృగాలకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్లు అప్పటికే నిజాం నవాబు తరపున తెలంగాణాపై పడి చాలా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వారి చేతిలో వేలాది మంది తెలంగాణా ప్రజలు ధనమానప్రాణాలు కోల్పోయారు. వారు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. గ్రామాలలో కాపాలాగా ఉన్న పురుషులని వెంటబడి బల్లెలతో క్రూర మృగాలని పొడిచినట్లు పొడిచి పొడిచి చంపేవారని, వారి కొన ప్రాణాలతో విలవిల కొట్టుకొంటుంటే, ఆడపడచుల బట్టలూడదీసి వారి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందేవారని అప్పటివారు చెప్తుంటారు. చివరికి పసిపిల్లలు, వృద్ధులపై కూడా రజాకార్లు ఏమాత్రం కనికరం చూపకుండా వెంటబడి చాలా దారుణంగా హింసించి హత్యలు చేసేవారు.

''తెలంగాణలో నెలకొన్న పరిస్థితి గురించి కాంగ్రెస్‌ నాయకుల నివేదిక మాకందింది. భూస్వాములపై జరుగుతున్న దాడులను మేం ఒప్పుకోము. త్వరలోనే తగు చర్య తీసుకుంటామ''ని ఢిల్లీలో హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ పోరాట ఫలాలను దక్కించుకోవడానికి తప్పనిసరై పటేల్‌ సైన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నాటి నెహ్రూ ప్రభుత్వం గుర్తించి వారు పోరాడి సాధించుకున్న భూములు వారికే దక్కుతాయని, భూస్వాముల దోపిడీ ఉండబోదని హామీ ఇస్తే పరిస్థితి భిన్నంగా ఉండేది.

సెప్టెంబర్‌ 13, 1948న తెలంగాణలోకి పటేల్‌ సైన్యాలు అడుగు పెట్టాయి. కోదాడ, దురాజ్ పల్లిలో తప్పా... మరెక్కడా నిజాం సైన్యాలు ప్రతిఘటించలేదు. సెప్టెంబర్‌ 17న నిజాంరాజు లొంగిపోయాడు. నెహ్రూ ప్రభుత్వం నిజాంకున్నా ఆస్తులు, రాజభవనాలు ఆయనవేనని ప్రకటించింది. హైదరాబాద్‌ రాష్ట్రానికి ''రాజ్‌ ప్రముఖ్‌'' పదవినిచ్చి సత్కరించింది. తెలంగాణ బిడ్డలను అరిగోసలు పెట్టిన రజాకార్ల నాయకుడు కాసీం రజ్వీ పాకిస్థాన్‌కు పోతానంటే దగ్గరుండి సాగనంపింది. మరోవైపు తెలంగాణ ప్రజల పై తన సైనిక చర్యను కొనసాగించింది. 1948 సెప్టెంబర్‌ నుండి 1951 అక్టోబర్‌ వరకు మూడేండ్లపాటు తెలంగాణను పటేల్‌ సైన్యాలు రక్తపుటేరుల్లో ముంచెత్తాయి. తెలంగాణ పల్లెల్లో బీభత్సం సృష్టించారు. కాటూరు, ఎలమర్రు మొదలగు గ్రామాలలో ఆడపడుచులను బట్టలిప్పించి బరివాతగా గాంధీ విగ్రహం చుట్టూ బతుకమ్మలాడించిన పటేల్‌ సైన్యాల దారుణకాండలను నాటి పత్రికలలో చదివిన భారతీయులందరూ సిగ్గుతో తలదించుకున్నారు. 1946 నుండి 1951 వరకు కొనసాగిన వీర తెలంగాణ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది తెలంగాణ బిడ్డలు అమరులవగా.. అందులో సగంపైగా పటేల్‌ సైన్యాల చేతుల్లోనే చనిపోయారు.

తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేని డాక్టర్‌ జయసూర్య (సరోజినీ నాయుడు కొడుకు) నాటి గవర్నర్‌ జనరల్‌ జే.ఎన్‌. చౌదరిని కలిసి... తెలంగాణ ప్రజలు కూడా భారతీయులేననీ.. వారి ఆకాంక్షలను గుర్తించి ఉద్యమకారులతో చర్చలు జరపాలని ప్రతిపాదించారు. నెహ్రూ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కర్కశంగా తిరస్కరించింది.

నాటి పరిణామాలన్నింటికి సజీవ సాక్షిగా నిలిచిన ప్రముఖ తెలంగాణ రచయిత దాశరథి రంగాచార్య తెలంగాణలో నాడు నెలకొన్న పరిస్థితులను నిష్పక్షపాతంగా అక్షరబద్ధం చేసారు. నిజాం హయాంలో... నెత్తిన రూమీ టోపీలు ధరించి... తెలంగాణ బిడ్డలపై జులుం చెలాయించిన దొరలు... ప్రజలు తిరగబడడంతో పల్లెల నుండి పారిపోయారు. దీంతో తెలంగాణకు సెప్టెంబర్ 17 నిజమైన స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిన రోజని నమ్ముతుంటారు.

సంబంధిత పోస్ట్