కరోనాతో ప్రపంచం అంతా స్తంభించిన సమయంలో సైతం మహబూబాద్ జిల్లా ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని వీడలేదు. పేపర్ పెన్సిల్ కార్యక్రమంతో ప్రతి విద్యార్ధితో ఇంటరాక్షన్ చేశారు. కరోనా భయంకరంగా విజృంభిస్తున్న కాలంలో సైతం వీరు సొంతంగా వర్క్ షీట్స్ తయారుచేసి, పేపర్ పెన్సిల్ అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రతి విద్యార్థికి విద్యను అందించారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ చేస్తున్న కార్యక్రమాలన్నీమహబూబాబాద్ జిల్లా ఉపాధ్యాయులు ఎప్పుడో చేపట్టారు. ఇప్పుడు విద్యాశాఖ ప్రసారం చేసే ఆన్లైన్ పాఠాలు ఒక్కో తరగతికి కేవలం అరగంట మాత్రమే ప్రసారం అవుతున్నవి. కానీ, ఉపాధ్యాయులు పూర్తి సమయం ఊర్లోనే ఉండి ప్రతి ఇంటికి తిరిగి అదనంగా బోధిస్తూనే ఉన్నారు. విద్యాశాఖ నెట్ లో ఉంచిన వర్క్ సీట్లు ప్రతి విద్యార్థికి అందాలనే ఉద్దేశ్యంతో ప్రింటు లకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నా ఉపాధ్యాయులు వెనకాడటం లేదు. కొద్ది మంది ఉపాధ్యాయులు తమ దాతృత్వం ప్రదర్శిస్తూ నోటు పుస్తకాలు పెన్నులు కూడా దానం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు మొదలు పెట్టకముందే మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ యూట్యూబ్ ఛానల్స్, జూమ్ మీటింగులు నిర్వహించి విద్యార్థులతో ఎల్లప్పుడూ ఇంటరాక్షన్ లో ఉన్నారు. కరోనా విజృంభించిన ఈ సమయంలో సైతం దూర ప్రాంతాల నుంచి అనేక ప్రయాసలకోర్చి తమ బోధన కొనసాగించారు. అన్ని ఊర్లు దాటుతూ అనేక వాహనాలు మారుతూ రావడం కరోనా వ్యాప్తి భయం ఉన్నప్పటికీ,గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పినప్పటికీ వీరు దీక్ష గా పని చేశారు. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆన్లైన్ విద్యతో పాటు పూర్తి స్థాయి ఆఫ్లైన్ విద్యను కూడా అందిస్తున్నారు. నిబంధనలు అడ్డు వస్తున్న సరే పిల్లలను చేరదీసి ఏదో ఒక చెట్టు కిందనో ఎవరి ఇంటి దగ్గరో, పాఠశాల ఆవరణ కు దూరంగానో ఒకచోట కూర్చోబెట్టి విద్య ని అందిస్తున్నారు. ఇక రికార్డులు రిపోర్టుల పని ఉండనే ఉంది. ఏదో అర్థగంట ప్రసారమయ్యే ఆన్లైన్ పాఠాలు పిల్లలకు అంతగా ఉపయోగపడకపోవటం వల్ల వాటిని నిర్వహిస్తూ, తమ పిల్లల్ని కాపాడుకోవడమే ప్రధానలక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యాయులు తమ కృషిని కొనసాగిస్తున్నారు. సాధారణ బడి రోజులకంటే పని భారం పెరిగినప్పటికీ తమ నిబద్ధత కొనసాగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.