హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్
కొల్లూరు మండలంలో వృద్ధుడిని హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఉజ్వల కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఈపూరులంక గ్రామానికి చెందిన యడ్లపల్లి నాగేశ్వరరావు అనే వృద్దుడిని ఈ నెల 2న రాత్రి 10:30 గంటల సమయంలో బంధువైన వెలివెల శ్రీరాములు ఇంట్లో లైట్లు తీసివేసి తన వెంట తెచ్చుకున్న ఇనుప చువ్వతో వృదుడిని హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వృద్ధుడికి గాయాలయ్యాయి. పొలాన్ని తనకు కౌలుకు ఇవ్వలేదనే అక్కసుతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.