ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం కోర్టు రోడ్డు, కిబులా కాలనీ వడ్డే సంఘం ఏరియా వార్డు సచివాలయం నందు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, రిజిస్టర్ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందించే సర్వీసుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.