అంతర్రాష్ట్ర రహదారి...ప్రమాదాలకు దారి
ఆదిలాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. అడుగుకొ గుంత ఏర్పడడంతో ఆ రోడ్డు గుండా ప్రయాణం చేసే ప్రజలు నరకయాతన పడుతున్నారు. భీంపూర్ మండలం గుండా వెళ్తున్న అంతర్రాష్ట్ర రహదారి గుంతల మయంగా మారింది. దీంతో తరుచూ ప్రమాదాలు జరగడంతో పలువురు ప్రజలు మృత్యువాత పడగా, మరెందరో గాయాలపాలై ఆస్పత్రిలో చేరుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు అయిన ఆదిలాబాద్ జిల్లాలోని బేలా మండలం నుండి మొదలైన ఈ రహదారి జైనాథ్, అదిలాబాద్ రూరల్, భీంపూర్, తాంసి మండలం మీదుగా మహారాష్ట్రలోని మాండ్వి వరకు ఈ అంతర్రాష్ట్ర రహదారి కొనసాగుతోంది. అయితే భీంపూర్ మండల పరిధిలో ఈ రహదారి మరింతగా గుంతలమయంగా మారింది. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామం నుండి భీంపూర్ మండలం అంతర్గం కరంజి (టి ) గ్రామం వరకు రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు ఉన్నాయి. రోడ్డుపై వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు పేర్కొంటున్నారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో రహదారిపై ప్రయాణం ఎంతో ఇబ్బందిగా మారిందని వాపోయారు. ఇక వర్షం పడితే ఈ గుంతలు కనబడక ప్రమాదాలలు సైతం జరుగుతున్నాయని తెలిపారు.